బ్యాంకు ఖాతాల స్తంభనపై కాంగ్రెస్‌ పిటిషన్‌ కొట్టివేత

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ ఆదాయపు పన్నుల చెల్లింపుపై ఐటీ శాఖ చేపట్టిన పునః పరిశీలనను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.  2014-15, 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించి ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్‌ రీఅసెస్మెంట్‌ ప్రొసీడింగ్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 20న తీర్పును రిజర్వు చేసింది.
 
పన్నుల చెల్లింపులో వ్యత్యాసాలు ఎంత వరకు ఉన్నాయని ధర్మాసనం ప్రశ్నించగా, నగదు, వస్తువులు అన్నింటినీ కలిపి రూ.520 కోట్ల వరకు తేడాలు ఉన్నట్టు గుర్తించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దాంతో ఈ కేసులో టాక్స్‌ అథారిటీ చట్టబద్ధమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కాంగ్రెస్‌ రిట్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.
 
కాంగ్రెస్‌ లెక్కల్లో చూపకుండా సుమారు రూ.520 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఐటీ శాఖ కచ్చితమైన సాక్ష్యం సమర్పించిందని జస్టిస్‌లు యశ్వంత్‌ వర్మ, పురుషీంద్ర కుమార్‌ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
ముఖ్యంగా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, 2013, 2018లలో జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అక్రమ లావాదేవీలు గుర్తించినట్టు పేర్కొనడమే కాక అప్పటి కాంగ్రెస్‌ నేతలు కమలనాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లకు వీటితో సంబంధం ఉందని నేరారోపణకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరం ఈ నెల 31 తేదీతో ముగియనున్న ఈ సమయంలో రీ అసెస్‌మెంట్‌ చేపట్టడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం చెప్పింది.