పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తప్పుడు వార్తలనుగుర్తించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) పరిదిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్(ఎఫ్‌సియు)ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 కింద మార్చి 20న కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ ఎఫ్‌సియుని నోటిఫై చేసింది. 

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే బూటకపు, తప్పుడు వార్తలను గుర్తించడానికి సవరించిన ఐటి నిబంధనల కింద ఎఫ్‌సియు ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెట్టింది.

రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణపై కొన్ని కీలక ప్రశ్నలు హైకోర్టు ఎదుట వచ్చాయని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఎఫ్‌సియు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.  

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను సవరిస్తూ 2023లో కొత్త నిబంధనలను ఎలెక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ రూపొందించింది. కొత్త నిబంధనల కింద ఎప్‌సియుని ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 20న కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఇది పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ప్రభావం చూపతుందని పేర్కొంటూ దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ నోటిఫికేషన్ ప్రకారం సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు, బూటకపు, తప్పుదారి పట్టించే వార్తలు ప్రచురిస్తే దానిపై సోషల్ మీడియా వేదికలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వార్తలను తొలగించాల్సి ఉంటుంది. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.