రోహింగ్యాలకు భారత దేశంలో చోటు లేదు

భారతదేశం లోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని, వారికి భారత్‌లో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

రోహింగ్యాల అక్రమ వలసలు భారత్‌కు అంతర్గత భద్రత దృష్టా ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు పలు నిర్ణయాలు తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం విదేశీ పౌరులు భారతదేశంలో సంచరించవచ్చు. కాని వారికి భారత దేశంలో స్థిరపడే హక్కులేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) శరణార్థి కార్డుతో రోహింగ్యా ముస్లింలు వస్తున్నారు. భారత దేశం ఇప్పటికే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిణామం అసోం, పశ్చిమబంగ రాష్ట్రాల జనాభా పరిస్థితిని మార్చింది. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఫలితంగా అంతర్గత భద్రత సమస్యలు వస్తున్నాయి. 

మరోవైపు నిర్బంధంలో ఉన్న రోహింగ్యాలను విడుదల చేయాలంటూ ప్రియాలీ సుర్ వేసిన పిటిషన్‌పై కూడా ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో నివసిస్తున్న రోహింగ్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై విదేశీ యాక్ట్ లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించింది.