దేశంలో 81 శాతం పెరిగిన చేపల వినియోగం

దేశంలో 81 శాతం పెరిగిన చేపల వినియోగం
గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెరిగినట్లు తాజాగా జరిగిన అధ్యయనం వెల్లడించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసిఎఆర్) లాంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి వరల్డ్‌ ఫిష్‌, ది ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐ ఎఫ్ పి ఆర్ ఐ) ఈ అధ్యయనం చేసింది.

2005-06 నుంచి 2020-21 మధ్య జరిగిన ఈ అధ్యయనంలో దేశంలో చేపల ఉత్పత్తి కూడా రెట్టింపై 14.164 మిలియన్‌ టన్నులకు చేరినట్లు తేలింది. దేశీయ వినియోగం 2005-2006లో 82.36 శాతం ఉండగా, 2019-2020 నాటికి 83.65 శాతానికి చేరింది. మిగతా మొత్తం ఆహారేతర అవసరాలకు, ఎగుమతులకు ఉపయోగించినట్లు వెల్లడైంది. 

ఇదిలావుంటే స్థానిక వినియోగానికి చేపలు, చేపల ఉత్పత్తుల దిగుమతి కూడా గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. స్థానికంగా లభించే, దిగుమతి చేసుకున్న చేపలను పరిగణనలోకి తీసుకుంటే.. దేశీయ మార్కెట్లో వినియోగించే చేపల మొత్తం పరిమాణం 120 శాతం పెరిగి 5.428 మిలియన్‌ టన్నుల నుంచి 11.924 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 

తాజా అధ్యయనం ప్రకారం త్రిపురలో అత్యధికంగా చేపల వినియోగదారులు 99.35% ఉన్నారు. ఇక హర్యానాలో అత్యల్పంగా 20.55% మంది మాత్రమే చేపలను ఆహారంగా తీసుకుంటున్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, గోవాలలో చేపలు తినే జనాభా 90 శాతానికి పైగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లలో ఈ గణాంకాలు 30 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.

కేరళ (53.5%), గోవా (36.2%) రాష్ట్రాల్లో రోజూ చేపలే తినేవారు ఎక్కువగా ఉన్నారు. వారానికి ఒకరోజు చేపలు తినేవారు అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో అధికంగా 69 శాతం చొప్పున ఉన్నారు. దేశంలో వార్షిక తలసరి చేపల వినియోగం 2029 – 2030 నాటికి 19.8 కిలోలకు పెరుగుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. 

మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధిరేటు కంటే చేపల వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు పేర్కొంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ విస్తరించడం ఇందుకు కారణంగా పరిశోధకులు అంచనా వేశారు. భారత్‌లో చేపలకు పెరుగుతున్న డిమాండుతో ప్రపంచంలో చేపలను అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశంగా ఉన్నదని, అయితే ప్రపంచవ్యాప్తంగా చేపల సగటు వినియోగంతో పోల్చితే మనమింకా వెనుకబడే ఉన్నామని ఐసిఎఆర్ డైరెక్టర్‌ జనరల్‌ హిమాంశు పాఠక్‌ తెలిపారు.