నెహ్రూకు అమెరికా అంటే కోపంతో చైనాతో దోస్తీ చేశారు

చైనా విషయంలో నెహ్రూ చూపించిన ఉదాసీన వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు.  భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు అప్పట్లో అమెరికా అంటే వ్యతిరేకత, కోపం ఉండేవని.. అందుకే అమెరికాతో కాకుండా చైనాతో దోస్తీ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే చైనా పట్ల భారత విదేశాంగ విధానంపై సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ చేసిన హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోలేదని తెలిపారు.
 
 చైనా విషయంలో ఉదాసీన వైఖరి అవలంభించవద్దని నెహ్రూను పలుమార్లు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ హెచ్చరించారని, అయినప్పటికీ నెహ్రూ వాటిని పట్టించుకోలేదని వివరించారు. చైనా, అమెరికాలతో సంబంధాలు, భారత్‌ విదేశాంగ విధానంపై ఓ నేషనల్ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  చైనా విషయంలో మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అవలంభించిన విదేశాంగ విధానం బుడగతో సమానమని జై శంకర్ తెలిపారు. 
 
ఈ క్రమంలోనే చైనా భారత్‌కు గొప్ప మిత్ర దేశమని నెహ్రూ కొనియాడినట్లు గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పట్లో అంతా దాన్నే నమ్మారని, ఇప్పటికీ కొందరు అదే మాట చెబుతున్నారని జై శంకర్ తెలిపారు. అంతే కాకుండా చైనా మనకు మిత్రదేశమని చెప్పారని, అంతా దాన్నే విశ్వసించారని పేర్కొన్నారు.
 
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్‌, చైనా దేశాల పట్ల అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై అప్పటి కేంద్రమంత్రులు శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వాటిపై నెహ్రూ అంతగా దృష్టి సారించలేదని విమర్శలు చేశారు. అంతే కాకుండా హిమాలయాలను దాటి వచ్చి భారత్‌ను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తుందని అనుకోవడం లేదని చెప్పేవారని పేర్కొన్నారు. 
 
కానీ 1962 లో చైనా భారత్‌పై ఆక్రమణకు పాల్పడినట్లు జై శంకర్ గుర్తు చేశారు.
1950లో అమెరికాకు భారత్‌ దూరం కావడానికి చైనానే ప్రధాన కారణమని చెప్పారు. భారత్, అమెరికా మధ్య దూరం గురించి నెహ్రూను అప్పటి న్యాయశాఖ మంత్రి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రశ్నించారని తెలిపారు. కానీ ఈ విషయాలు ఏవి కూడా ఇప్పటి వారికి తెలియవని జై శంకర్ పేర్కొన్నారు. 
 
అయితే తొలి ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానాలనే ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కూడా అనుసరించారని చెబుతూ ఒకవేళ అలా కాకుండా చైనా పట్ల కఠినంగా ప్రవర్తిస్ అదేదో పెద్ద తప్పు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని జై శంకర్ ఆరోపించారు. కంపెనీల్లో ఆడిట్‌ వ్యవస్థ ఉన్నట్లే దేశాలు అనుసరిస్తున్న విదేశాంగ విధానాలకు ఆడిట్‌ ఉండాలని ఈ సందర్భంగా జై శంకర్‌ సూచించారు.