రష్యా – ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి భారత్‌ మద్దతు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఇరు దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ  ప్రధాని మోదీని లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
అయితే, వారి ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారా..? లేదా..? అన్న దానిపై స్పష్టత లేదు. ఇక ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.  పుతిన్‌ మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. ఆ తర్వాత కొంత సేపటికే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా మాట్లాడారు.

ముందుగా పుతిన్‌తో మాట్లాడిన మోదీ ఇటీవలే జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అత్యున్నత పదవి చేపట్టినందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఉక్రెయిన్‌తో వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే మేలని సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్‌-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా నేతలతో చర్చించినట్లు విదేశాంగ శాఖ పేర్కొన్నారు.

అదేవిధంగా భారత్- ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ చర్చించారు.  భారత్- ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, కాల్పుల విరమణపై చర్చించినట్లు ప్రధాని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. రష్యాతో రెండేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 

‘శాంతి కోసం అన్ని ప్రయత్నాలకు భారతదేశం కట్టుబడి ఉంది. ఇరుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. చర్చలు, దౌత్య మార్గాల్లో యుద్ధం ముగింపునకు ప్రయత్నిస్తామని జెలెన్‌స్కీకి మోదీ చెప్పారు. అదే సమయంలో ఉక్రెయిన్‌కు మానవతా సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయం సైతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చెప్పినట్లు తెలిపారు. అయితే, ఉక్రెయిన్‌కు భారత్‌ అందిస్తున్న మానవతా సాయాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.