తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన నటుడు శరత్‌కుమార్‌

లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తమిళ నటుడు ఆర్‌ శరత్‌ కుమార్‌ తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (ఎఐఎస్ఎంకె) ని బీజేపీలో విలీనం చేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో శరత్‌కుమార్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

మంగళవారం సాయంత్రం తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని శరత్‌కుమార్‌ కలిశారు. సమావేశం అనంతరం చెన్నైలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐక్యతతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ప్రధాని మోదీ ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.

మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి మోదీ భరోసాగా నిలుస్తున్నారని ప్రశంసించారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన నేపథ్యంలో శరత్ కుమార్ తన సోషల్ మీడియా ఖాాల్లో మోడీ కా పరివార్ అనే పదాన్ని జోడించడం గమనార్హం.

కాగా, 1996లో డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన శరత్‌కుమార్‌ 2001లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఆ తర్వాత 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకేకు గుడ్‌బై చెప్పి తన సతీమణి రాధికతో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. కానీ కొద్ది నెలలకే అన్నాడీఎంకేను సైతం వీడారు. 2007 ఆగస్టులో ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (ఎఐఎస్ఎంకె) పేరుతో పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

అంతకు ముందు, అమ్మ మక్కల్ మునేత్ర ఖజగం (ఎఎంఎంకె) రానున్న లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులో బిజెపి మద్దతు తెలిపింది. బిజెపికి వచ్చే ఎన్నికలలో బేషరతు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ ప్రకటించారు.