నూతన పౌరసత్వ చట్టంతో అసోంలోకి లక్షల మంది ప్రవేశిస్తారనే భయాలు ప్రజల్లో నెలకొనడంపై స్పందిస్తూ అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చే ఎవరు కూడా పౌరసత్వం పొందలేరని, అదే జరిగితే తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ప్రకటించారు.
శివసాగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘నేను అస్సాం పుత్రుడిని. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) కి దరఖాస్తు చేయకుండా ఒక్కరికైనా కొత్త చట్టం కింద పౌరసత్వం లభిస్తే మొదట వ్యతిరేకించే వ్యక్తిని నేనే. అదే కనుక జరిగితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని స్పష్టం చేశారు.
ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు చెప్పే మాటలు నిజమా.. కాదా..? అనేది పోర్టల్‌లో ఉన్న డాటానే చెప్తుందని హిమాంత తెలిపారు. అదేవిధంగా సీఏఏ కొత్త చట్టమేమీ కాదని చెబుతూ గతంలోనే రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని తెలిపారు. అవసరమైన వారు నిర్దేశిత పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వీధుల్లోకి రావడంవల్ల ఏ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించగానే 16 పార్టీల కూటమి అయిన అసోం యూవోఎఫ్‌ఏ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దాంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసులు వివిధ పార్టీలకు నోటీసులు జారీ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనలు చేపట్టకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సహకరించాలని కోరారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెక్‌పోస్టుల వద్ద భద్రతను పెంచారు. 2019లో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించగానే గువాహటి సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
More Stories
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు