బీజేపీలో చేరిన బిఆర్ఎస్ కీలక నేతలు

ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు ఎక్కువగా నడుస్తున్నాయి. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతున్నారు. అందులో.. కొందరు హస్తంతో దోస్తీ కడుతుంటే.. మరికొందరు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది అధికార కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటుంటే.. ఇక కొందరు మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్ముకుంటున్నారు.
 
తాజాగా ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు.  మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలైన సీతారాం నాయక్, గోడం నగేశ్‌తో పాటు హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు బీజేపీ కండువా కప్పుకున్నారు.  వీళ్లంతా ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితర నేతలు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కేటీఆర్‌కు అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయనొక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. వీరే కాదు.. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ పీ రాములు బీజేపీలో చేరిపోయారు. కాగా.. ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలిజాబితాలో జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పీ రాములు కుమారుడు భరత్‌లను పార్టీ అభ్యర్థులుగా బిజెపి ప్రకటించింది.