సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత

టీడీపీ, జనసేనలతో పొత్తు కుదరడం పట్ల హర్షం ప్రకటిస్తూ సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.  శ్రీరాముడికి కూడా ఉడుత సాయం అవసరమైందని, ఏపీలో అరాచక పాలన అంతం చేయడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని ఆమె స్పష్టం చేశారు.
 
విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని పురందేశ్వరి తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనే అంశంపై అభిప్రాయ సేకరణకు రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు తెలిపారు.
 
“ప్రచార రథాలలో రెండు బాక్సులు ఉంటాయి. ఒక బాక్సులో కేంద్రంనుంచి మీరేమీ ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరిస్తాం. మరో బాక్సులో రాష్ట్రం కోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తాం. కోటిమంది నుంచి అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యం. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మ్యానిఫెస్టోలో చేరుస్తాం” అని పురంధేశ్వరి వివరించారు.
 
జాతీయస్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా రాష్ట్రస్థాయి కి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్న పురంధేశ్వరి.. ఏపీ వ్యాప్తంగా 45వేల కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని, వారంతా పొత్తును అర్థం చేసుకుంటారని పురందేశ్వరి భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.