పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్‌ అలీ జర్దారీ

పాకిస్థాన్‌ దేశానికి 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సహ వ్యవస్థాపకుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. జర్దారీ పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఇది రెండోసారి. పీపీపీ, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ సంయుక్తంగా పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధికార కూటమి తరఫున 68 ఏళ్ల ఆసిఫ్‌ అలీ జర్దారీ అధ్యక్ష పదవికి బరిలో నిలిచారు.

జర్దారీ ప్రత్యర్థిగా సున్నీ ఇత్తేహద్‌ కౌన్సిల్‌ పార్టీకి చెందిన 75 ఏళ్ల మహ్మద్‌ ఖాన్‌ అచక్‌జాయ్‌ అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో ఆసిఫ్‌ అలీ జర్దారీకి 255 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి మహ్మద్‌ ఖాన్‌కు 119 ఓట్లు పడ్డాయి. 

వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జర్దారీ పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో భర్త. పాకిస్థాన్‌ 13వ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ పదవీకాలం గత ఏడాదితో ముగియడంతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జర్దారీ గతంలో 2008 నుంచి 2013 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడంతో అధ్యక్ష ఎన్నికలు ఆలస్యమయ్యాయి. న్యూ ఎలక్టోరల్‌ కాలేజీ ఏర్పాటైన తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.

1955లో కరాచీలో జన్మించిన ఆయన 1987లో బెనజీర్‌ భుట్టోను వివాహం చేసుకున్న తర్వాత ప్రఖ్యాతి పొందుతూ వచ్చారు. అప్పటి వరకు భార్యకు మద్దతుగా తెరవెనుక ఉంటూ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్న ఆయన 2007లో భార్య ఉగ్రదాడిలో హత్యకు గురైన తర్వాత క్రియాశీల రాజకీయాలలోకి వచ్చారు.

భార్య హత్యకు గురికావడంతో ఏర్పడిన సానుభూతి ప్రవాహంలో ఆయన 2008లో దేశ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. పాకిస్తాన్ లో ఒకే సారి రెండో పర్యాయం అధ్యక్ష పదవి చేపట్టడం ఇదే కావడం విశేషం. దేశ అధ్యక్షునిగా తన మామగారైన జుల్ఫీకర్ అలీ భుట్టోను సైనిక నియంత 1979లో మరణ శిక్ష విధించి వధించిన ఘటనపై 2011లో సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. అప్పటి నుండి కోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తూ, చివరకు మూడు రోజులో క్రితమే మార్చ్ 6న భుట్టోకు మరణ శిక్ష విధించే సమయంలో న్యాయవిచారణ నిస్పక్షపాతంగా జరగలేదని స్పష్టం చేసింది.

దేశ అధ్యక్షునిగా అంతకు ముందు అధ్యక్ష పదవిలో ఉంటూ ఓ రాజ్యాంగ సవరణ ద్వారా విశేష అధికారాలను సంక్రమించుకున్న ముషారఫ్ చర్యలను తిరగదోశారు. 1977లో 18వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ కు సంక్రమింప చేసిన అధికారాలను తిరిగి ధారాదత్తం చేశారు. వివాదరహితంగా, భార్య మృతి అనంతరం పిపిపి ముక్కలు కాకుండా, పార్టీని కాపాడుకొంటూ వచ్చారు.

అయితే, రాజకీయ నాయకుడిగా వివాదరహితంగా మెలుగుతూ వస్తున్నా భార్య రెండు పర్యాయాలు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో `మిస్టర్ 10 పర్సెంట్’ అంటూ చెలరేగిన అవినీతి పూర్వరంగం ఆయనను వెంటాడుతూ వచ్చింది.