త్వరలో విశాఖ – భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 41 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ  త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ మరింత వినూత్నంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. త్వరలోనే అవి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది.

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. అంతర్రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది. పొరుగునే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్- విశాఖపట్నం మార్గంలో రాకపోకలు సాగించనుంది.

భువనేశ్వర్‌లో బయలుదేరే ఈ రైల పూరి, కటక్, బ్రహ్మపూర్ మీదుగా విశాఖపట్నానికి రాకపోకలు సాగిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.