లాలూ పాలనలో ఆటవిక రాజ్యంగా మారిన బీహార్

లాలూ ప్రసాద్ సాగించిన దశాబ్ద కాలం పాలనలో బీహార్ ఆటవిక రాజ్యంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ  ఆరోపించారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియాలో బుధవారం ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్‌జెడి- కాంగ్రెస్ దుష్పరిపాలనలో బీహార్‌కు చెందిన యువజనులు పెద్దసంఖ్యలో వలసలు పోవలసి వచ్చిందని చెప్పారు. 

ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం బీహార్ పాలిట మహాపరాధులుగా ప్రధాని అభివర్ణించారు. ఎన్‌డిఎ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడడం మొదలైందని ఆయన చెప్పారు. వారి దుష్పరిపాలనతో ఒక తరం మొత్తం నష్టపోయిందని, పెద్ద సంఖ్యలో యువజనులు వలసలు పోయారని, కాని ఒకే ఒక్క కుటుంబం వృద్ధి చెందిందని మోదీ  ఆరోపించారు. 

కుటుంబం లేనందు వల్లనే మోడ్  వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటూ లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, బాబాసాహెబ్ అంబేద్కర్, కర్పూరీ ఠాకూర్ వంటి మహానేతలు ఇప్పుడు జీవించి ఉంటే సొంత కుటుంబాలను ప్రోత్సహించనందుకు వారిపైన కూడా ఇలాంటి వ్యక్తులు(లాలూ) దాడి చేసి ఉండేవారని మోదీ మండిపడ్డారు. 

తనకు కుటుంబం లేకపోవడమే వారికి అక్కసుగా ఉన్నట్లుందని పేర్కొంటూ తనకు మాత్రం యావద్దేశం తన కుటుంబమేనని ప్రధాని స్పష్టం చేశారు. ఈరోజు దేశమంతా మోదీ కా పరివార్‌గా భావిస్తోందని ఆయన చెప్పారు. తమిళనాడుకు చెందిన డిఎంకె ఎంపి ఎ రాజా వివాదాస్పద వ్యఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ వాల్మీకి మహర్షి నడయాడిన పవిత్ర భూమి ఈ చంపారన్ అని, ఈ గడ్డపైనే సీతమ్మవారు ఆశ్రయం పొంది లవకుశులకు జన్మనిచ్చారని తెలిపారు.

ఇండియా కూటమి పార్టీలు శ్రీరాముడికి చేస్తున్న అవమానాలను ఇక్కడి ప్రజలు క్షమించరని ప్రధాని హెచ్చరించారు. మన సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారని మోడ్ తెలిపారు.

 రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమికి 400కు పైగా స్థానాలు దక్కుతాయని ఆయన పునరుద్ఘాటించారు. భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారుచేసేందుకు, ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రజలు తమ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని ప్రధాని పిలుపునిచ్చారు.