క్యాన్సర్‌ కు వంటింట్లోని మసాలా దినుసులతో చికిత్స

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్‌ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిపై తాజాగా పేటెంట్‌ కూడా పొందారు. ఈ ఔషధంపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి 2028 నాటికి మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఐఐటీ మద్రాస్‌లోని కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఆర్‌ నాగరాజన్‌ తెలిపారు. 
 
ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ, నోటి, థైరాయిడ్‌ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానోమెడిసిన్‌తో నయం చేయవచ్చని ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు నిరూపించారు. ఈ ఔషధంతో క్యాన్సర్‌ కణాల చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ముప్పూ ఉండదని తెలిపారు. జంతువులపై ఈ ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలిచ్చాయి. 
 
త్వరలోనే మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టనున్నారు. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎలా ఉత్పత్తి చేయాలన్నదానిపై దృష్టిపెట్టినట్టు నాగరాజన్‌ తెలిపారు.
తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా బ్రెయిన్‌ స్ట్రోక్స్‌, గుండె సమస్యలేగాక క్యాన్సర్‌ బారిన పడే అవకాశమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 
 
ఒత్తిడిని ముందే గుర్తించి, చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ వ్యాధి ముదరకుండా ప్రాథమిక దశలో అడ్డుకోవచ్చునని న్యూయార్క్‌లోని ‘కోల్డ్‌ స్ప్రింగ్‌ హార్బర్‌ ల్యాబొరేటరీ’ సైంటిస్టులు కనుగొన్నారు. స్ట్రెస్‌ హార్మోన్స్‌ ప్రభావంతో తెల్లరక్త కణాలైన ‘న్యూట్రోఫైల్స్‌’ శరీరంలో క్యాన్సర్‌ కణతులు ఏర్పరుస్తున్నాయని, ఎలుకలపై వివిధ రకాలుగా జరిపిన ప్రయోగాల్లో ఇది నిరూపితమైందని పరిశోధకులు చెప్పారు.