నెలకు ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన సౌర విద్యుత్తును కోటి గృహాలకు అందించే పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కానికి కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. సోలాప్ ప‌వ‌ర్ సిస్ట‌మ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఖ‌ర్చులో కేంద్ర ప్ర‌భుత్వం సుమారు రూ. 78 వేలు ఇవ్వ‌నున్న‌ది. 
 
దేశ‌వ్యాప్తంగా దాదాపు కోటి  ఇండ్ల‌కు ఈ ప‌థ‌కం అమలు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఉచిత క‌రెంటు స్కీమ్ కింద కేంద్ర ప్ర‌భుత్వం దాదాపు రూ. 76 వేల కోట్లు కేటాయించింది. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం ప్ర‌భుత్వం కొంత ఖ‌ర్చును అందివ్వ‌నున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన ఈ స్కీమ్‌ను ప్ర‌ధాని మోదీ లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే.
 
కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడిస్తూ  ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో క్యాబినెట్ భేటీ జ‌రిగింద‌ని, ఉచిత క‌రెంటు ప‌థ‌కానికి ఆమోదం ద‌క్కింద‌ని, ఈ స్కీమ్ కింద కోటి మంది కుటుంబాల‌కు 300 యూనిట్ల క‌రెంటు ప్ర‌తి నెల‌ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక 2025 నాటికి అన్ని కేంద్ర ప్ర‌భుత్వ బిల్డింగ్‌లపై రూఫ్‌టాప్ సోలార్ ప‌వ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నట్లు మంత్రి చెప్పారు.
 
2024-25 మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పథకాన్ని ప్రకటించారు. సోలార్ ఇన్ స్టలేషన్లను కొనుగోలు చేయడానికి మరియు గ్రిడ్ కు మిగులు సౌర విద్యుత్ ను విక్రయించడానికి ప్రజలకు ప్రోత్సాహకాలను అందించేలా ఈ పథకం ఉంటుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సోలార్ (గ్రిడ్)కు కేటాయింపులు రూ.10,000 కోట్లు కాగా, 2023-24లో రూ.4,970 కోట్లు కేటాయించారు. పవన విద్యుత్ (గ్రిడ్)కు 2023-24లో రూ.1,214 కోట్లు కేటాయించగా, రూ.930 కోట్లు కేటాయించారు.

 కాగా, 2024 ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల రాయితీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అలాగే ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎరువుల రాయితీ అమలు చేయనున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, గత సీజన్‌లో ఉన్న ధరలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు అనురాగ్‌ ఠాకూర్ చెప్పారు.

ఇక భూసార పౌష్టికంగా వాడే డిఎపి ఇకపై కూడా క్వింటాలుకు రూ 1,350గా కొనసాగుతుంది. డిఎపితో పాటు ఇతరత్రా పికె ఎరువులకు కూడా ఇప్పటి ధరలే ఉంటాయి. ఇప్పుడు 50 కిలోల డిఎపి ఎరువు మార్కెట్‌లో రూ 1350కే విక్రయిస్తున్నారు. ఈ ధరలే కొనసాగుతాయి. తమ ప్రభుత్వం పూర్తిగా రైతు మిత్రత్వ పద్థతినే పాటిస్తుందని, దీనికి అనుగుణంగానే రైతులకు పోటాషియం ఇతరత్రా ఎరువులను తక్కువ ధరలకే విక్రయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.