గాజాలో ప్రజలపై ఇజ్రాయెల్‌ ఆర్మీ కాల్పుల్లో 104 మంది మృతి

పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. 280 మంది గాయపడ్డారు. మృతదేహాలను, కాల్పుల్లో గాయపడిన వారిని లారీల్లో ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కార్యాలయం ఈ సంఘటనపై స్పందించింది. నబుల్సి రౌండ్ అబౌట్ వద్ద సహాయ సామగ్రి లారీల కోసం వేచి ఉన్న ప్రజలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ ఆక్రమణ సైన్యం జరిపిన దారుణమైన మారణకాండను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.  సుమారు ఐదు నెలలుగా గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న అమానవీయ దాడులతో పాటు కరువు పరిస్థితుల కారణంగా   30,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.

హమాస్‌ నేతృత్వంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలు ప్రకటించింది. ఈజిప్ట్‌, ఖతార్‌, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ నాటికి సంధి కుదరవచ్చని భావిస్తోంది. గాజాలోని అల్‌-షిఫా ఆస్పత్రిలో పౌష్టికాహార లోపం, డిహైడ్రేషన్‌, కరువు కారణంగా చిన్నారులు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ ఖుద్రా పేర్కొన్నారు.

 ఈ మరణాలను నివారించడానికి ‘తక్షణ చర్యలు’ చేపట్టాలని అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌ మరిన్ని సరిహద్దులను తెరవాల్సిన అవసరం ఉందని, దీంతో అవసరమైన మానవతా సాయం పెరగవచ్చని యుఎస్‌ఎఐడి అధ్యక్షుడు సమంతా పవర్‌ పేర్కొన్నారు. ‘ఇది జీవన్మరణ సమస్య’గా మారిందంటూ గాజాలో క్షీణిస్తున్న పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఉత్తర గాజాకు సహాయక లారీలు వచ్చినప్పుడు జనం పెద్ద సంఖ్యలో నెట్టుకోవడం, తోసుకోవడం వల్ల పలువురు గాయపడినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. అయితే తమకు ముప్పుగా భావించిన ఇజ్రాయెల్‌ సైనికులు పాలస్తీనా ప్రజలపై కాల్పులు జరిపినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.