`ఉగ్ర’ రక్తంతో పాకిస్థాన్ తడిసిపోయిన పాకిస్తాన్

ఉగ్రవాద దాడులతో పారిన రక్తంతో పాకిస్థాన్ తడిసిపోయిందని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి అనుపమ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్‌, తుర్కియేలకు లేదని తేల్చి చెప్పారు. భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్థాన్‌ ఉపయోగించుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

కాశ్మీర్ విషయంలో అదే పాట పాడుతున్న దాయాది దేశానికి అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలనే ప్లాన్‌ను భారత్‌ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. దీంతో పాకిస్థాన్‌కు మరోసారి ఐక్యరాజ్యసమితలో భంగపాటు తప్పలేదు. మరోసారి కాశ్మీర్‌ అంశంలో భారత్‌పై విమర్శలు చేసిన పాకిస్తాన్‌కు భారత ప్రతినిధి గట్టిగా బుద్ధి చెప్పారు. 

భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్‌ సహా వేరే ఏ దేశానికి లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతూ భారత్‌పై విమర్శలు చేసిన తుర్కియేకు కూడా భారత్ చురకలు అంటించింది. జెనీవా వేదికగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55 వ సమావేశం జరుగుతోంది. 

ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌, తుర్కియే దేశాలు లేవనెత్తాయి. భారత్‌లో మానవ హక్కుల అణిచివేత జరుగుతోందని నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలోనే పాక్, తుర్కియే చేసిన ఆరోపణలకు భారత కార్యదర్శి అనుపమ సింగ్‌ గట్టి హెచ్చరిక చేశారురు. రైట్‌ టు రిప్లై అవకాశం కింద పాకిస్థాన్, తుర్కియే వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌లోనే మానవ హక్కుల ఉల్లంఘన, టెర్రరిజం, మైనారిటీల అణిచివేత జరుగుతున్నాయని అనుపమ సింగ్ తిప్పికొట్టారు.

ఉగ్రవాద దాడులతో పారిన రక్తంతో పాకిస్థాన్ తడిసిపోయిందని.. అనుపమ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్‌, తుర్కియేలకు లేదని తేల్చి చెప్పారు. భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్థాన్‌ ఉపయోగించుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

పాకిస్థాన్ చేసిన ప్రసంగంలో కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడాన్ని ప్రస్తావించిన అనుపమ సింగ్.. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు భారత్ తరఫున చెప్పేది ఒక్కటేనని.. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్‌ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగాలేనని తేల్చి చెప్పారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదంటూ హెచ్చరించారు. 

ఇదే సమయంలో పాక్‌కు మద్దతు ఇస్తూ.. తుర్కియే కూడా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు అనుపమ సింగ్ తెలిపారు.