అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దు

 
రానున్న ఎన్నికల్లో తన అన్న వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రజలు ఓటేయ వద్దని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత విజ్ఞప్తి చేశారు. తాను వ్యవస్థను నమ్ముతున్నానని, తాను చేస్తున్న న్యాయ పోరాటంలో ప్రజల సహకారం తనకు కావాలని ఆమె అభ్యర్హ్దించారు. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన తన తండ్రి వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్య చేసిన నిందితుల్ని సిఎం జగన్ కాపాడుతున్నారని సునీత ఆరోపించారు.

సీబీఐపై ఎలాంటి ఒత్తిడి ఉందో తనకు తెలియదని చెబుతూ ఎవరో అడ్డుపడుతున్నారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయకూడదని పేర్కొన్నారు. సిబిఐ నిందితుల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి ఉన్నారని చెబుతూ వారిని జగన్ రక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు.  వారి పాత్ర ఉందో లేదో సిబిఐ విచారించాలని వారి పాత్ర ఉంటే బయటపెట్టాలన్నారు. విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు అండగా నిలవాలని కోరుతూ జగన్‌ విలువలు విశ్వసనీయత అనే మాటలు పదేపదే చెబుతుంటారని, అవన్నీ వివేకానందరెడ్డి విషయంలో ఎందుకు జగన్‌కు గుర్తు రావడం లేదని నర్రెడ్డి సునీత ప్రశ్నించారు. తండ్రి హత్య కేసు దర్యాప్తుపై జగన్ తనకు ఇచ్చిన మాట ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఎంపీ అవినాష్‌ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.

వివేకాను చంపిన దుష్ట చతుష్టయం ఎవరని, ముఖ్యమంత్రి వారికి సాయం చేయడం తప్పు కాదా? ఏంటి నిలదీశారు.   సిఎం పదేపదే మంచికి చెడుకు యుద్ధం అంటున్నారని, చంపిన వారిని రక్షించడం మంచిదా? అని ప్రశ్నించారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారని, పెత్తందారులంతా కలిసి వివేకా హత్య కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరిగితే, ఇంకా చాలామందికి ప్రేరణ లభిస్తుందని చెప్పారు. విశాఖలో కరోనా సమయంలో ప్రశ్నించిన డాక్టర్‌కు ఏమైందని, ఎమ్మెల్సీ డ్రైవర్‌ హత్య కేసులో ఎవరు ఎందుకు పోరాడటం లేదని, ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం లేదని, ఆ నమ్మకాన్ని కలిగించడానికి తాను పోరాడుతున్నానని సునీత చెప్పారు.

రాజకీయాలు కాదని న్యాయం కోసం తనకు అండగా నిలవాలని, సమాజంలో మార్పు కోసం ప్రజలు ఓటు ద్వారా తీర్పునివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఉండకూడదని, హంతకులు పాలకులుగా ఉండకూడదని, ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల జీవితాలు మారడానికి, బాగుపడటానికి ఉపయోగపడేలా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.