ఏపీలో టీడీపీ, జనసేనలకు దూరంగా ఒంటరిగా బిజెపి పోటీ!

నిన్నమొన్నటిదాకా టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని భావించినప్పటికీ ఇప్పుడు బీజేపీ సొంతంగానే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీతో పాటు ఢిల్లీలో తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. 

ఈ క్రమంలోనే ఆపరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో బీజేపీ కొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ప్రధానమైన మూడు పార్టీలు –  వైసిపి, టిడిపి, జనసేన లలో పెద్ద ఎత్తున అసంతృత్తి వెల్లడవుతుంది. ఈ పార్టీల నాయకత్వంపై కీలక నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. అటువంటి నాయకులను ఆకట్టుకొని బలమైన పక్షంగా ఎన్నికలలోకి దిగాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.

ఏపీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.

మరోవంక, ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నుంచి భారీగా నేతలను చేర్చుకోవాలని ప్లాన్‌ చేస్తున్నది. టీడీపీ, వైసీపీ పార్టీలో టికెట్‌ దక్కని అసమ్మతి నేతలపై ఫోకస్‌ పెట్టింది.  ఇప్పటికే 30 నుంచి 40 మంది నేతలు బీజేపీ నాయకులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2, 3 తేదీలలో  విజయవాడలో బీజేపీ కీలక సమావేశాలు జరగనున్నాయి. వీటికి ఢిల్లీ నుంచి కూడా ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

ఈ సమావేశాల్లోనే బీజేపీ తదుపరి కార్యాచరణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో అన్ని నియోజకవర్గాల నుండి పార్టీ  నేతలను ఆహ్వానించడంతో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కాగా, బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌జీ నేతృత్వంలో హైదరాబాద్ నగర శివార్లలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ భేటీకి ఏపీ నుంచి 10 మంది ముఖ్య నేతలను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి పొత్తులు సహా వివిధ ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తులే కాకుండా, సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలని పార్టీ నేతలకు శివప్రకాశ్‌జీ సూచించినట్లు తెలుస్తోంది.