ఎన్నికలలో వాలంటీర్ల వినియోగం ఈసీ ఆదేశాల దిక్కారనే

ఆంధ్రప్రదేశ్ లో రాబోవు ఎన్నికలలో వాలంటీర్లను వినియోగించి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాలను దిక్కరించినట్లే అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీన కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో ఓటు వేద్దాం – ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన కళాజాత కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. 
 
పట్టణ ఓటర్లలో ఓటింగ్ శాతం పెంచటానికి కృషి జరగాలని చెబుతూ ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, వార్డు సచివాలయ సిబ్బంది సైతం ఎన్నికల విధుల్లో పరిమితంగా మాత్రమే వినియోగించాలని ఆదేశించినప్పటికీ నేడు ఈ ఆదేశాలకు భిన్నంగా అధికార పార్టీ పనిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి హాని కలిగిస్తుందని విమర్శించారు. 
 
తిరుపతిలో 35వేల దొంగ ఓట్లను సాంకేతిక నైపుణ్యం ను ఉపయోగించి అధికార పార్టీకి ఎన్నికల లబ్ధి కోసం ఐఏఎస్ అధికారి, నకిలీ ఈ. ఆర్. ఒ స్థాయి అధికారి పనిచేయడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సహకారంతో ఓటర్ల వివరాలను సేకరించి, అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం  వినియోగిస్తుందని చెప్పారు. 
 
ఇలాంటి చర్యలను ఆపకపోతే ఇతర రాష్ట్రాలుకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఇతర మంత్రులు కూడా ఎన్నికలలో వాలంటీర్లను సైన్యంగా ,ఎన్నికల అంబాసిడర్ గా, పోలింగ్ ఏజెంట్లుగా వినియోగిస్తామని ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అవసరమైతే మరల ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తామని, న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
 
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ ఈనెల 25న విశాఖపట్నంలో ప్రారంభమైన ఓటర్ల చైతన్య కళాయాత్ర 26 జిల్లాల జిల్లా కేంద్రాలలో ప్రదర్శించి, మార్చి 8న కర్నూల్లో ముగింపు ప్రదర్శన ఇస్తామనీ తెలిపారు .అధికార యంత్రాంగం ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించకుండా అధికార పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరిస్తే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తుందని ,కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
హెల్త్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఐ.వి రావు ప్రసంగిస్తూ, యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు. ఓటును ప్రలోభాలకు లోను కాకుండా సక్రమంగా వినియోగిస్తే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. రంగం ప్రజా సాంస్కృతిక కన్వీనర్ రాజేష్ నేతృత్వంలోని కళాకారుల బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సబికులను ఆలోచింపచేసాయి.