సందేశ్‌ఖాలీ ప్రధాన నిందితుడు షేక్‌ షాజహాన్‌ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్‌ షాజహాన్‌ షేక్‌  ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖాలోని ఓ ఇంట్లో ఉంటున్న ఆయనను గురువారం ఉదయం 3 గంటలకు అదుపులోకి తీసుకున్నటుల పోలీసులు ప్రకటించారు. అనంతరం బసిర్హత్ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.
 
ఈ ఏడాది జనవరి 5న రేషన్‌ పంపిణీ కుంభకోణంపై విచారణకు సంబంధించిన షాజహాన్‌ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై సుమారు వెయ్యి మంది దాడికి పాల్పడ్డారు. అప్పటినుంచి ఆయన కనిపించకుండా పోయారు. దాదాపు 55 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న షాజాహాన్‌ను పోలీసులు నేడు పట్టుకున్నారు. 
 
కాగా, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈడీ, సీబీసై సైతం ఆయనను అరెస్టు చేయొచ్చని కోల్‌కత్తా హైకోర్టు బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవంక ఈ కేసు విచారణను పశ్చిమ బెంగాల్ సిఐడి విభాగం చేపట్టింది.

షేక్ షాజ‌హాన్‌పై ఆరేళ్ల నిషేధం విధించింది తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ.  టీఎంసీ పార్టీ నేత డెరిక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నుంచి షేక్ షాజ‌హాన్‌ను ఆరేళ్లు స‌స్పెండ్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

షేక్ షాజహాన్, అతని అనుచరులు సందేశ్ ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొన్నారు. రేషన్ పంపిణీ కుంభకోణం తీవ్ర కలకలం రేపింది. ఆ స్కామ్‌నకు సంబంధించి జనవరి 5వ తేదీన విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాజహాన్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో షాజహాన్ అనుచరులు అధికారులపై దాడికి తెగబడ్డారు.

 ఆ తర్వాత షాజహాన్ పారిపోయాడు. ఆ ఘటన తర్వాత షాజహాన్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. షాజహాన్‌ను పోలీసులే కాకుండా దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయొచ్చని ఆదేశాలు జారీచేసింది.

షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని అధికార టీఎంసీ స్వాగతించింది. హైకోర్టు కలుగజేసుకోవడంతో షాజహాన్ అరెస్ట్ జరిగిందని పేర్కొంది. గత నెలరోజులకు పైగా సందేశ్ ఖాలీలో అశాంతికి కారణం షాజహాన్ అని, అతని అరెస్ట్‌తో ఇప్పుడు పరిస్థితి సద్దుమణగనుందని అభిప్రాయ పడింది.   అయితే,షాజహాన్ అరెస్ట్‌‌తో ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఇప్పుడు షాజహాన్ పోలీసుల భద్రత మధ్య కట్టుదిట్టంగా ఉన్నారని మండిపడింది.