గుజరాత్ తీరంలో రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

గుజరాత్‌ తీరంలో 3,300 కేజీల మత్తుపదార్థాలను నార్కోటిక్స్‌ అధికారులు సీజ్‌చేశారు. ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్‌ పట్టబడడం దేశంలోనే తొలిసారి. ఇరాన్‌ పోర్టు నుంచి పడవలో అక్రమంగా తరలిస్తున్న వీటిని పట్టుకున్న అధికారులు ఐదుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో నిందితులు పాకిస్థాన్‌ లేదా, ఇరాన్‌కు చెందినవారు అయి ఉంటారని భావిస్తున్నారు.
 
వారి నుంచి తురాయా కంపెనీకి చెందిన శాటిలైట్‌ ఫోన్‌, నాలుగు మొబైల్‌ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  అరేబియా సముద్రం మీదుగా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ అక్రమ రవాణా జరగబోతోందంటూ కొన్ని వారాలుగా అందుతున్న సమాచారంతో నేవీ, ఎన్‌సీబీ, గుజరాత్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. దీనికి ‘సాగర్‌మంథన్‌-1’ అని పేరు పెట్టారు. 
 
నౌకాదళం తన పీ8ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానం, మెరైన్‌ కమాండోలను యుద్ధనౌక, హెలికాప్టర్లలో మోహరించింది. డ్రగ్స్‌ మోసుకొస్తున్న చేపల బోటును మంగళవారం ఉదయం అరేబియా సముద్రంలో భారత తీరానికి 60 నాటికల్‌ మైళ్ల దూరంలో, అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబీఎల్‌) వద్ద అధికారులు అడ్డగించారు.ఈ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న 3,300 డ్రగ్స్‌లో 3,110 కేజీల చరాస్‌ లేదా హాషిస్‌, 158.3 కేజీల క్రిస్టల్‌ మెథాంఫెటామిన్‌, ‘రాస్‌ అవద్‌ గూడ్స్‌ కో, పాకిస్థాన్‌ ఉత్పత్తి’ అని రాసి ఉన్న 24.6 కేజీల హెరాయిన్‌ ప్యాకెట్లు ఉన్నాయి. ఇవి ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవు నుంచి రవాణా అవుతున్నట్టు ఎన్‌సీబీ తెలిపింది. పట్టుబడిన డ్రగ్స్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 1300 నుంచి రూ. 2 వేల కోట్ల వరకు ఉంటుందని ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. దేశంలో ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.