హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ ప‌ట్టేసిన భార‌త్

రాంచీలో జ‌రిగిన నాలుగో టెస్టులో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యం సాధించింది. అన్ని విభాగాల్లో ర‌ఫ్ఫాడించిన టీమిండియా హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ కైవ‌సం చేసుకుంది. దాంతో, స్వ‌దేశంలో రికార్డు స్థాయిలో 17వ టెస్టు సిరీస్ ఖాతాలో వేసుకుంది. బ‌జ్ బాల్ ఆట‌తో ప్ర‌త్య‌ర్ధుల‌ను వ‌ణికించిన ఇంగ్లండ్‌కు రాంచీలో భార‌త జ‌ట్టు తొలి సిరీస్ ఓట‌మిని రుచి చూపించింది.
 
ఇంగ్లండ్ యువ స్పిన్న‌ర్లు టామ్ హ‌ర్ట్లే, షోయ‌బ్ బ‌షీర్‌లు హ‌డలెత్తించినా శుభ్‌మ‌న్ గిల్‌(52 నాటౌట్) హాఫ్ సెంచ‌రీతో అదుకున్నాడు.  మ‌రోసారి ఆప‌ద్భాంద‌వుడి అవ‌తార‌మెత్తిన‌ ధ్రువ్ జురెల్‌(39 నాటౌట్) స‌మ‌యోచిత బ్యాటింగ్‌తో రోహిత్ సేన‌ 5 వికెట్ల తేడాతో విజ‌య ఢంకా మోగించింది.  భార‌త జ‌ట్టు విజ‌యానికి ఇంకా 63 ప‌రుగులు కావాల్సిన ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన జురెల్ మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టును ఒడ్డున ప‌డేసిన అత‌డు గిల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించాడు. బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్, రెండు ర‌న్స్ తీసిన జురెల్ టీమిండియాకు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం అందించాడు. దాంతో, ప‌న్నెండేండ్ల క్రింత 2-1తో సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్‌పై రోహిత్ సేన ప్ర‌తీకారం తీర్చుకుంది.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ అనూహ్యంగా త‌డ‌బ‌డింది. బంతి ట‌ర్న్ కావ‌డంతో బ‌షీర్, హ‌ర్ట్లేల ధాటికి 16 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 84 ప‌రుగుల వ‌ద్ద య‌శ‌స్వీ జైస్వాల్(37 44 బంతుల్లో) వెనుదిర‌గ‌గా ఫిఫ్టీ బాదిన‌ రోహిత్ శ‌ర్మ‌(55 81బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్) హ‌ర్ట్లే బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 

ఆ త‌ర్వాత వ‌చ్చిన ర‌జ‌త్ పాటిదార్(0) డ‌కౌట్ కావ‌డంతో 100 ప‌రుగుల‌కే మూడు శ‌లో జ‌డేజా, గిల్‌లు నాలుగో వికెట్‌కు 71బంతుల్లో 20 ర‌న్స్ జోడించ‌డంతో 118/3 తో లంచ్‌కు వెళ్లిన భార‌త జ‌ట్టు.. ఆ త‌ర్వాత రెండో ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఉప్ప‌ల్ టెస్టు ఓట‌మి త‌ర్వాత పుంజుకున్న రోహిత్ బృందం సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో బెన్ స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లండ్‌కు చెక్ పెట్టింది.