ఆప్‌ అభ్యర్థే చండీగఢ్‌ మేయర్‌.. సుప్రీం వెల్లడి

చండీగఢ్ మేయర్‌ ఎన్నిక విషయంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు మంగళవారం తెరదించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్‌ కుమారే చట్టబద్ధమైన విజేత అని నిర్ధారించింది. రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషి కొట్టివేసి చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు ఆప్‌ అభ్యర్థికే పడినట్లు గుర్తించింది. 
 
బీజేపీ అభ్యర్థి మేయర్‌గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన ఫలితాలను రద్దుచేసింది.  ఈ వివాదానికి కారకుడైన రిటర్నింగ్‌ అధికారి, బీజేపీ మైనారిటీ సెల్‌ మాజీ సభ్యుడు అనిల్‌ మాషిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు అనిల్‌ మాషికి షోకాజ్‌ నోటీసు జారీచేసింది.
 
 కాగా, ఈ వివాదంపై తొలుత రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషి ‘X’ మార్కు గీసి చెల్లనివిగా ప్రకటించిన ఓట్లను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతాలో వేసి మళ్లీ లెక్కించాలని చండీగఢ్ అధికార యంత్రాంగాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దాంతో మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆప్‌ అభ్యర్థినే కోర్టు మేయర్‌గా నిర్ధారణ చేసింది. కొన్ని వారాల వివాదానికి తెరదించింది.
 
చండీగఢ్ మేయర్‌ ఎన్నిక విషయంలో నెలకొన్న వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషి ‘X’ మార్కు గీసి చెల్లనివిగా ప్రకటించిన ఓట్లను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతాలో వేసి ఓట్లను మళ్లీ లెక్కించాలని చండీగఢ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. 
 
చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వివాదంపై విచారణ జరిపింది.  ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ టర్నింగ్ అధికారి అనిల్‌ మాషి చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లను పరిశీలించారు. ఆ 8 ఓట్లు ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌కు పడినట్లు గుర్తించారు. అనంతరం అనిల్‌ మాషిపై సీరియస్‌ అయ్యారు. 
 
బ్యాలెట్ పేపర్‌పై ‘X’ మార్క్‌ గీసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆప్‌ అభ్యర్థి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి కూడా అనిల్‌ మాషి తీరును తప్పుపట్టారు. అతను చేసింది తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించారు.కాగా, గత నెల 30 చండీగఢ్‌ మేయర్‌ పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన అనిల్‌ మాషి పక్షపాత వైఖరితో వ్యవహరించినట్లు ఆరోపణలు చెలరేగాయి. 

బీజేపీకి తక్కువ ఓట్లు రావడంతో ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌కు పడిన 8 ఓట్లపై ‘X’ మార్కు గీసి వాటిని చెల్లనివిగా ప్రకటించారు. మిగిలిన ఓట్లను లెక్కించి బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటన చేశారు. దాంతో బీజేపీ అభ్యర్థి మేయర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై ఆప్‌ అభ్యర్థి కోర్టుకు వెళ్లడంతో విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పు వెల్లడించింది.