మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సమాయాత్తమైంది.  2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. 18వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  
 
ఇప్పటికే ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఇసిఐకి చెందిన అధికారుల బృందం వరుసగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి.  
 
దీంతో మార్చి 8-9 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిస్సా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది.గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
బీహార్‌లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం సోమవారం అక్కడకు చేరుకుంది. సీఈసీతో పాటు, ఎన్నికల కమిషనర్లు అరుణ్ గోయల్, ధర్మేంద్ర శర్మ, ఇతర సీనియర్ అధికారులు కూడా రాష్ట్రానికి చేరుకున్నారని, రాబోయే రెండు రోజులు ఇక్కడే ఉంటారని అధికారి ఒకరు తెలిపారు.

వీటితోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో మార్చి 8, 9 తేదీల్లో ఈసీ బృంద భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించేందుకు మార్చి 12,13 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది.

గతంలోలానే ఈ సారి కూడా ఏప్రిల్‌ – మే నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకూ ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు.