ఓటీపీకి స్వస్తి పలికే ఆలోచనలో రిజర్వు బ్యాంకు!

మన దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తుందో, అంతే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ ఫ్యాకర్ట్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైమ్ పాస్‌వర్డ్స్ (ఓటీపీ) బదులుగా ఇతర అవకాశాలను పరిశీలించాలని బ్యాంకుల వంటి రెగ్యులేటెడ్ సంస్థలను ఆర్‌బీఐ కోరింది. 

అంటే మరికొన్ని రోజుల్లోనే ఓటీపీకి స్వస్తి పలకనున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపై ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ లేకుండానే చెల్లింపులు చేసేందుకు వీలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఓటీపీ స్థానంలో ఎలాంటి కొత్త విధానం తీసుకొస్తారు? దానికి మొబైల్ అవసరం ఉండదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డిజిటల్ చెల్లింపుల ధ్రువీకరణ కోసం ఓటీపీ అథెంటికేషన్ బదులుగా కొత్త మెకానిజం అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలే ప్రకటించారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వెల్లడించారు. 

డిజిటల్ పేమెంట్స్ విధానంలో మార్పులకు అనుగుణంగా చెల్లింపులకు మరింత భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ విధానం తీసుకువస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పద్దతులలో పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ, ఈ విషయమై త్వరలో సవివరమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. 

అయితే, ఓటీపీకి స్వస్తి పలికినప్పటికీ కొత్త మెకానిజంలోనూ అథెంటికేషన్ చేసేందుకు మొబైల్ అవసరం కానుంది. అథెంటికేషన్ కోసం తప్పనిసరిగా మొబైల్ ఉండాల్సిందే. సైబర్ నేరగాళ్లు తెలివిగా వ్యవహరిస్తూ కస్టమర్ల వివరాలు, పాస్‌వర్డ్స్ తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత ఓటీపీ కోసం సిమ్ కార్డు స్వాపింగ్ చేసి ఖాతాల్లోని డబ్బులు కాజేస్తున్నారు. 

అలాగే ఓటీపీకి బదులుగా మరో ఫోన్ యాప్ నుంచి పాస్ వర్డ్ అడిగే అథెంటికేటర్ యాప్ అనేది కీలకంగా మారుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. దీనికి అదనంగా సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యామ్నాయాలను సృష్టించుకోవచ్చు. అందులో మొబైల్ అప్లికేషన్స్ లో టోకెన్ల వంటివి జనరేట్ చేయడం ఉండొచ్చని తెలిపారు. అయితే, వీటన్నింటికీ మొబైల్ ఫోన్ అవసరమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

కమ్యూనికేషన్ ప్లాట్ ఫారమ్ రూట్ మొబైల్ ఇప్పటి వరకు వివిధ సర్వీస్ ప్రొవైడర్ల తరపున ప్రతి నెలా దాదాపు నాలుగు బిలియన్ల ఓటీపీలను పంపుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. డిజిటల్ విధానం పెరుగుతున్న క్రమంలో అదే స్థాయిలో డిజిటల్ మోసాలు సైతం పెరుగుతున్నట్లు తెలిపింది.