భవిష్య నిధి వడ్డీ రేటు 8.25 శాతం

* రిటైర్డు ఉద్యోగులకూ ఈఎస్‌ఐ సేవలు

ఆరు కోట్ల మంది భవిష్య నిధి ఖాతాదారులకు  2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటు చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం. 2020-21లో 8.5 శాతం వడ్డీ రేటు చెల్లించిన ఈపీఎఫ్‌ఓ 2021-22 సంవత్సరంలో దానిని 8.10 శాతంగా నిర్ణయించింది. 

2022-23 సంవత్సరంలో స్వల్పంగా పెంచి 8.1 శాతం వడ్డీని చెల్లించింది. కాగా, సీబీటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తరువాత వడ్డీ రేటును అధికారికంగా ఈపీఎఫ్‌ నోటిఫై చేస్తుంది. ఆ తరువాత వడ్డీ మొత్తాన్ని తమ చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. 

గడిచిన పదేళ్ల కాలంలో పీఎఫ్‌ వడ్డీ రేట్లను పరిశీలిస్తే 2013-14లో 8.75 శాతం వడ్డీ చెల్లించగా 2015-16లో అత్యధికంగా 8.80 శాతం వడ్డీ చెల్లించింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చిన వడ్డీరేటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యల్ప స్థాయికి చేరుకుంది.

ఇలా ఉండగా, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఈఎస్ఐ ద్వారా అంతకుముందు వైద్య బీమా చేయించుకున్నవారికే ఇది వర్తిస్తుంది. ఇందుకోసం నిబంధనలను సడలిస్తూ శనివారం ఈఎ్‌సఐ కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకొంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐ కార్పొరేషన్‌ 193వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వేతనం పెరిగిన కారణంగా ఈఎ్‌సఐ పరిధి నుంచి బయటపడ్డ ఉద్యోగులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. పదవీ విరమణ/స్వచ్ఛంద పదవీ విరమణ నాటికి వారు ఈఎ్‌సఐ పరిధిలో లేనప్పటికీ అంతకు కనీసం అయిదేళ్ల ముందు వైద్య బీమా పరిహారం చెల్లించి ఉంటే రిటైరైన తరువాత కూడా ఆ ప్రయోజనం పొందడానికి అర్హులవుతారు. 

2012 ఏప్రిల్‌ 1 తరువాత వరుసగా అయిదేళ్ల పాటు ఈఎ్‌సఐ ప్రీమియం చెల్లించి, 2017 ఏప్రిల్‌ 1 తరువాత పదవీ విరమణ చేసిన రూ.30వేల నెల జీతం ఉన్న ఉద్యోగులకు దీన్ని అమలు చేస్తారు.