తెలంగాణాలో మొత్తం 17 సీట్లు గెలవడమే బిజెపి లక్ష్యం

* ఐదు చోట్ల నుండి 20 నుండి విజయ్ సంకల్ప్ యాత్రలు

తెలంగాణలో అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని ప్రకటిస్తూ హైదరాబాద్ తో సహా మొత్తం 17 సీట్లను గెలుపొంటమే తమ లక్ష్యం అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరిస్తూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి సానుకూల వాతావరణం కనపడుతోంది చెప్పారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యమయ్యేలా, ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, ప్రజల ఆశీస్సులు తీసుకోవడం కోసం రాష్ట్ర శాఖ 5 బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఐదు ప్రాంతాలలో ఫిబ్రవరి 20న ఈ యాత్రలు ప్రారంభమై మార్చి 1 వరకు కొనసాగుతాయి. కొనసాగుతుంది. 5న అన్ని యాత్రలు హైదరాబాద్ లో ముగుస్తాయని వివరించారు.

* కొమురం భీం యాత్ర -1 :  ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు.
* శాతవాహన యాత్ర -2 : కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలు.
* కాకతీయ యాత్ర -3 : ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్.
* భాగ్యనగర యాత్ర -4 : భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి.
* కృష్ణమ్మ యాత్ర -5 : మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ.

ఈ యాత్రలు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో కొనసాగుతాయి. ప్రతిరోజు 2 నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్రలను నిర్వహిస్తారు. ప్రతి మండల కేంద్రంలో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రోడ్ షోలు ఉంటాయి. పార్టీ ముఖ్య నాయకులు బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొంటారని కిషన్ రెడ్డి వివరించారు.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నిల్లో బిజెపికి సానుకూల వాతారణం కనపడుతోందని, నరేంద్ర మోదీకి మద్దతుగా రాష్ట్రంలోని ప్రజలు నిలుస్తున్నారని భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రధానంగా బిజెపి -కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ ఉంటుందని చెబుతూ నరేంద్ర మోదీకి ఎదురునిలబడే శక్తి, ఏ కూటమికి లేదని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గత పార్లమెంటు ఎన్నికల కంటే అద్భుత మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గత ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపలేక పోయిన ఖమ్మం, నల్లగొండ వంటి ప్రాంతాల నుంచి కూడా నరేంద్ర మోదీకి 80 శాతం మంది ప్రజలు అండగా నిలుస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఎన్నికల కుటుంబ, అవినీతి పార్టీలకు-ధర్మం కోసం పనిచేస్తున్న బిజెపికి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ఈ ఎన్నికలు సుస్థిరతకు- అస్థిరతకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు.

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి , రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమ తదితరులు కూడా పాల్గొన్నారు.