తొలి ఆదివాసీ స్వతంత్య్ర సమరయోధుడు తిల్కా మాంఝీ..!

భారతదేశం విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడు, మొదటి ఆదివాసీ నాయకుడు తిల్కా మాంఝీ. బిహార్ లోని సంతాల్ ప్రాంతంలో 1750 ఫిబ్రవరి 11 న జన్మించిన తిల్కా మాంఝీని దేశ తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రకెక్కాడు. బ్రిటీష్ వారిని ఎదురించి.. తన తోటి ఆదివాసీలను వలసవాదుల నుంచి కాపాడిన ధీరుడు మాంఝీ. 1770 ప్రాంతంలో సంతాల్ లో తీవ్రమైన కరువు రావడంతో బ్రిటీష్ సానుభూతి పరులకు చెందిన ఆస్తులను కొల్లగొట్  సంపదను స్థానికులకు పంచిపెట్టాడు.
అప్పటి నుంచి అంటే 1771 నుంచి 1784 మధ్య కాలంలో బ్రిటీష్ సైన్యంతో తిరుగులేని పోరాటం చేశాడు. తన ప్రజలను, భూమిని రక్షించుకునేందుకు కడదాకా తిరుగుబాటు చేశాడు. తిల్కా మాంఝీ ఈ తిరుగుబాటు నుంచి ప్రేరణ పొందిన అనేక ఇతర గిరిజనులు కూడా ఈ పోరాటంలో పాలుపంచుకున్నారు. దీంతో సంతాల్ ప్రాంతంలో బ్రిటీష్ అధికారులపై పోరాటం తీవ్రరూపం దాల్చింది.
బ్రిటీష్ వారితో పాటు వారికి అనుకూలంగా ఉండే వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. దాదాపు 13 యేళ్ల కాలంలో తెల్లదొరలపై చేసిన పోరాటంలో ఎక్కడా రాజీ పడకుండా ఎదురునిలిచాడు. ఈ క్రమంలో మాంఝీ ఆదివాసీలతో ఓ సమూహాన్ని ఏర్పాటు చేశాడు. వారందరికి విల్లంబులు, బాణాలు ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న అగస్టస్ క్లీవ్‌ల్యాండ్‌పై తిల్కా మాంఝీ దాడి చేశాడు. ఈ దాడిలో అగస్టస్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు మాంఝీ ఉంటున్న తిలాపూర్ అడవిని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఎదురుదాడి తీవ్రంగా జరిగింది. అయితే బ్రిటీష్ వారి ముందు తిల్కా మాంఝీ సమూహం నిలవలేకపోయింది. దీంతో 1784 ప్రాంతంలో తిల్కా పట్టుబడ్డాడు. ఆ సమయంలో తిల్కాను గుర్రపు తోకకు కట్టి ఈడ్చుకెళ్లారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లోని కలెక్టర్ నివాసానికి లాక్కెళ్లారు. పూర్తిగా మట్టికొట్టుకుపోయిన ఆ శరీరాన్ని కలెక్టర్ నివాసంలో ఉన్న ఓ పెద్ద మర్రిచెట్టుకు ఉరితీశారు.
స్వాతంత్య్రం వచ్చాక తిల్కా మాంఝీని ఉరితీసిన ప్రదేశంలో  ఆయన స్మారకార్థం ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భాగల్పూర్ విశ్వవిద్యాలయానికి తిల్కా మాంఝీ అని పేరుపెట్టారు. మంగళ్ పాండే కంటే దాదాపు 70 ఏళ్ల కంటే ముందే బ్రిటీష్ వారిని ఎదిరించిన తిల్కా మాంఝీ ఆదివాసీల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాడు.