మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజ పురోగతి

మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం పురోగతి చెందుతుందని.. తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. సేవా భారతి తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహించిన “రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్” 5 కే, 10కే, 21కే రన్ ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
మూడు విభాగాల్లో నిర్వహించిన పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది గచ్చిబౌలీ స్టేడియం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా తిరిగి గచ్చీబౌలీ స్టేడియానికి చేరుకోవడంతో రన్ పూర్తైంది. ఈ సందర్భంగా ముఖ్యంగా బస్తీలు, మురికివాడల్లో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి కోసం పనిచేస్తున్న సేవాభారతిని గవర్నర్ తమిళిసై ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి రిథమ్ తెలుగు, నిజం టుడే మీడియా పార్ట్‌నర్ గా వ్యవహరించాయి.
భారతీయ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా ‘సేవాభారతి’ స్వచ్ఛందసంస్థ అవిరళ కృషి చేస్తోంది. బాలికా విద్య, మహిళా సాధికారత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పలురకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సేవాభారతి సంస్థ దేశవ్యాప్తంగా 263 మురికివాడల్లో సేవలందిస్తోంది. బాలికలు, యువతులు, మహిళల భవిష్యత్తుపై స్థానికులకు అవగాహన కల్పిస్తుంది.
ఇప్పటికి 10వేల మందికి పైగా బాలికలకు చదువుకునే అవకాశం కల్పించి, వారు తమకాళ్ళపై తాము నిలబడేలా తీర్చిదిద్దింది. 2030 నాటికి కనీసం లక్ష మంది బాలికలు, మహిళలు సాధికారతను సంపాదించుకునేలా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ‘బేటీ బచావో-బేటీ పఢావో’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపును అందిపుచ్చుకుని.. బాలికా విద్య గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది.