యుపిఎ ప్రభుత్వంలో కుటుంబానికే మొదటి ప్రాధాన్యత

కాంగ్రెస్‌ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చిన ఆ పార్టీ 2014లో దేశాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టిందని, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంపై మోదీ ప్రభుత్వానికి ఉపన్యాసాలు ఇస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.
 
 ‘భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, దేశ ప్రజల జీవితాలపై దాని ప్రభావం’ అనే అంశంపై లోక్‌సభలో శుక్రవారం ఆమె చర్చను ప్రారంభిస్తూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను టాప్‌-5కు తీసుకెళ్లిందని తెలిపారు. భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని చెప్పారు.
 
 ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకతతో వ్యవహరించి దేశానికి తొలి ప్రాధాన్యం ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ శ్వేతపత్రం స్పష్టంగా చెబుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘దేశానికికాకుండా కుటుంబానికి మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు పారదర్శకత కాకుండా వేరే ఆలోచన చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరూ చూశారు. అదే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే వచ్చే ఫలితాలు కూడా బాగుంటాయని కరోనా అనంతర పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి” అని ఆమె వివరించారు. 
 
 యూపీఏ పాలనలో పారదర్శకత, చిత్తశుద్ధి లోపించిందని ఆమె ఆరోపించారు.  “మీరు దేశానికి మొదటి స్థానం ఇవ్వనప్పుడు, మీరు మీ మొదటి కుటుంబానికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, మీరు పారదర్శకత కంటే ఇతర పరిగణనలను కలిగి ఉన్నప్పుడు, ఫలితాలు మీరు చూడగలిగేలా ఉన్నాయి” అని సీతారామన్ విమర్శించారు.  ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక అవినీతి, కుంభకోణాలతో కొనసాగుతున్న పార్టీ ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతోందని విపక్ష సభ్యుల అరుపుల మధ్య మంత్రి ఎద్దేవా చేశారు.

‘‘2008నాటి సంక్షోభ సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. ఒకటి తర్వాత ఒకటిగా కుంభకోణాలు వెలుగుచూశాయి. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడలేకపోయిన వారు ఇప్పుడు మాకు పాఠాలు చెబుతున్నారు’’ అని నిర్మల మండిపడ్డారు. 

యూపీఏ హయాంలో బొగ్గు కుంభకోణం వల్ల దేశానికి రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని, 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్‌లను సుప్రీంకోర్టు రద్దుచేయాల్సి వచ్చిందన్న కాగ్‌ నివేదికను మంత్రి ఉదహరించారు. మీరు బొగ్గును బూడిదగా మారిస్తే మోదీ ప్రభుత్వం తన విధానాల ద్వారా దాన్ని వజ్రాలుగా మార్చిందని ఆమె చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు బొగ్గు గనులు కేటాయించిన వారు క్రోనీ కేపిటలిజంపై ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు.