భారీ మెజారిటీతో మూడోసారి తిరిగి మోదీదే అధికారం

దేశంలో పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రముఖ న్యూస్ చానల్ `ఇండియా టుడే’  నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది ’నేషన్ సర్వే దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.గురువారం ఈ సర్వే ఫలితాలను ఆ చానల్ వెల్లడించింది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి భారీ మెజారిటీతో మూడో సారి తిరిగి అధికారంలోకి రావచ్చని స్పష్టం చేసింది. 

 అయితే 400కు మిచి స్థానాలను దక్కించుకోవాలన్న టార్గెట్‌కు చాలా దూరంలోనే నిలుస్తుందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పుటికిప్పుడు జరిగితే బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 335 స్థానాలను దక్కించుకోవడం ద్వారా అధికారంపై తన పట్టును నిలుపుకొంటుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలకన్నా ఇది ఎక్కువే కానీ ఇప్పుడున్న బలంతో పోటిస్తే ఆ కూటమి 18 స్థానాలను కోల్పోనుంది.

ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి లబ్ధిపొందుతుంది. ఇండియా కూటమి 166 స్థానాల్లో విజయం సాధించవచ్చు. కానీ ఎన్‌డిఎ బలంగా ఉన్న రాష్ట్రాల్లో దానికి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం 543 స్థానాల్లో 304 స్థానాలు దక్కించుకొంటుంది. అంటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మించి స్థానాలను దక్కించుకోనుంది. 

అంతేకాదు, 2019లో ఆ పార్టీ సాధించిన 303 స్థానాలకన్నా ఒక సీటు ఎక్కువే కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన స్థానాలకన్నా 19 సీట్లు ఎక్కువ ఆ పార్టీ సాధించనుంది. ఇతర పార్టీలు 168 స్థానాలను దక్కించుకోనున్నాయి.

అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇంటర్వ్లూద్వారా శాస్త్రీయపద్ధతిలో నిర్వహించిన ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సంక్షేమ పథకాలతో పాటు, జాతీయ దృక్పథం ద్వారా ప్రజల్లో బిజెపి సాధించిన పట్టుకు అద్దం పడుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించడంతో పాటుగా కలిసికట్టుగా ఉన్నామని చెప్పడంలో ప్రతిపక్షాల వైఫల్యం ఎన్నికల్లో ఆ కూటమి వైఫల్యానికి కీలకమైన అడ్డంకిగా కనిపిస్తోంది. 

అయితే జాతీయ స్థాయిలో తన ఆధిక్యతను అసెంబ్లీ ఎన్నికల్లోను కనబరిచే విషయంలో బిజెపి సవాళ్లను ఎదుర్కొంటోందనే విషయం దేశ వ్యాప్తంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక్క యుపి మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంది. మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి విపక్షాలనుంచిగట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యధికంగా 80 స్థానాలున్న యూపీలో మరోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించనుంది. ఆ పార్టీ సొంతంగా 70 సీట్లను, మిత్రపక్షం ఆప్నాదళ్‌(ఎస్‌) 2 సీట్లను గెల్చుకోనున్నాయి. 2019లో ఈ రెండు పార్టీలకు కలిపి 64 సీట్లు (బీజేపీ 62) రాగా ఇప్పుడు అవి పెరగనున్నాయి. 

ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన సమాజ్‌వాదీపార్టీ గత ఎన్నికల్లో గెల్చుకున్న 15 స్థానాల్లో 8 కోల్పోయి, ఈసారి ఏడు స్థానాలకు పరిమితం కానుంది. కాంగ్రెస్‌ ఒక్క సీటునే గెల్చుకోనుంది. యూపీ తర్వాత అత్యధిక సీట్లున్న మహారాష్ట్ర(48)లో శివసేన, ఎన్సీపీలు అంతర్గత పోరుతో చీలిపోయిన విషయం తెలిసిందే. 

శివసేనలో ఉద్ధవ్‌వర్గం, ఎన్సీపీలో శరద్‌పవార్‌ వర్గం ఇండియా కూటమిలో ఉండగా, సీఎం ఏక్‌నాథ్‌షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ ఎన్‌డీఏలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు(26) ఇండియా కూటమి గెల్చుకోనుంది. కూటమిలోని కాంగ్రెస్‌ 12 సీట్లు, ఎన్సీపీ-పవార్‌, శివసేన-ఉద్ధవ్‌ కలిసి 14 సీట్లు గెల్చుకోనున్నాయి. 

ఇక 42 సీట్లతో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్టు 22 సీట్లను గెల్చుకోనుంది. బీజేపీకి 19 సీట్లు, కాంగ్రె్‌సకు ఒక్క సీటు లభించవచ్చు. వామపక్షాలకు ఒక్క సీటూ రాదట. 40 సీట్లున్న బిహార్‌లో ఎన్‌డీఏ 32, ఇండియా 8 సీట్లను గెల్చుకోవచ్చు. 

అయితే, ఈ సర్వే జరిగిన సమయానికి ఇండియా కూటమిలో ఉన్న నితీశ్‌ ఇటీవల ఎన్‌డీఏలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏకు లభించే సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. 39 సీట్లున్న తమిళనాడులో అన్ని సీట్లనూ డీఎంకే-కాంగ్రె్‌సలతో కూడిన ఇండియా కూటమి గెల్చుకోనుంది. గుజరాత్‌, రాజస్థాన్‌లను గత ఎన్నికల్లోల్లాగే ఈసారి కూడా బీజేపీ పూర్తిగా స్వీప్‌ చేయనుందని ఈ సర్వే వెల్లడించింది.