ఆసక్తికరంగా `ఆర్టికల్ 370′ ట్రైలర్

బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో ‘ఆర్టికల్ 370’ మూవీ వస్తోంది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఆర్టికల్ 370 చిత్రం థియేటర్లలో విడుదల  కానుంది. ఈ తరుణంలో గురువారం ట్రైలర్ విడుదల అయింది.

`ఆర్టికల్ 370′ చిత్రంలో యామీ గౌతమ్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌ పాత్ర పోషించారు. కశ్మీర్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఘర్షణలు, అవినీతిపై పోరాడుతుంటారు. జము కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 ప్రత్యేక స్టేటస్ వల్ల ఆమె విధులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఘర్షణలను అరికట్టేందుకు కూడా ఈ అధికరణ ఇబ్బందిగా ఉంటుంది. 

అయితే, ఆర్టికల్ 370 అధికరణను ప్రభుత్వం ఎత్తేయాలని నిర్ణయించే క్రమంలో జరిగిన ప్రక్రియను కూడా ట్రైలర్లో మేకర్స్ చూపించారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం, ఆ తర్వాత పరిణామాలు కూడా ట్రైలర్లో ఉన్నాయి. “మొత్తం కశ్మీర్.. భారత దేశంలో అంతర్భాగమే.. ఎప్పటికీ అలాగే ఉంటుంది” అనే డైలాగ్‍తో ట్రైలర్ ముగిసింది. 

`ఆర్టికల్ 370′ ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‍గా సాగింది. 2 నిమిషాల 43 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ గ్రిప్పింగ్‍గా ఉంది. `ఆర్టికల్ 370′ చిత్రంలో ప్రియమణి,   వైభవ్, తత్వవాది, అరుమ్ గోవిల్, రాజ్ అరుణ్, స్కంద ఠాకూర్, అశ్విన్ కౌల్, కిరణ్ కర్మాకర్, దివ్య సేత్ షా, రాజ్ జుత్షి, సుమిత్ కౌల్, గోపినాథ్, అశ్విని కుమార్ కీలపాత్రలు పోషించారు. 

ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య ధార్, లోకేశ్ ధార్ నిర్మించారు. ఆర్టికల్ 370 మూవీకి శష్వాంత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. చాలా సీన్లను ఎలివేట్ చేసింది. ఇంటెన్సిటీని కొనసాగించింది. సిద్ధార్థ్ వాసానీ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది.

భారత దేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని ఈ చిత్రంలో చూపించామని దర్శకుడు ఆదిత్య సుహాస్ చెప్పారు. రాజకీయ అంశంతో పాటు యాక్షన్ కూడా ఈ చిత్రంలో సమతూకంతో ఉంటుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ఢిల్లీ, కశ్మీర్లో చేసినట్టు వెల్లడించారు.  ఆర్టికల్ 370 రద్దు అంశమే ప్రధానంగా ఈ చిత్రంలో ఉంటుందని స్పష్టం చేశారు.

సుహాస్ జంబాలే గతంలో రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. జమ్ము కశ్మీర్‌లో ‘ ఆర్టికల్ 370’ని 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక స్టేటస్‍ను ఎత్తేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.  దీనికి వ్యతిరేకంగా కూడా అక్కడ నిరసనలు జరిగాయి. అయితే, కొన్నాళ్లకు శాంతి భద్రతలను ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. ఈ అంశంపైనే  ‘ఆర్టికల్ 370’ మూవీ వస్తోంది.