సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

ఎక్సైజ్ పాలసీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదుసార్లు తమ సమన్లును బేఖాతారు చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 17న హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.

ఢిల్లీ కోర్టు ఆదేశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. కోర్టు ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, చట్ట ప్రకారం చర్చలు తీసుకుంటామని తెలిపింది. చట్టవిరుద్ధంగా ఈడీ ఇచ్చిన ఆదేశాలను కోర్టుకు వివరిస్తామని తెలిపింది. కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఇంతవరకు ఐదుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినా గైర్హాజరయ్యారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందని భావిస్తున్న ఈడీ విచారణకు హాజరుకావాలని ఆయనకు ఐదుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే, ఆయన మాత్రం తనకు వేరే పనులు ఉన్నాయంటూ ఒక్కసారి కూడా హాజరుకాలేదు.

2023 నవంబర్ 2, 2023 డిసెంబర్ 22, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ ఈ సమన్లు ఇచ్చింది. కేజ్రీవాల్ గైర్హాజరుపై రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేయడంతో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేజ్రీవాల్‌కు తాజా సమన్లు పంపారు.

కాగా, రౌస్ అవెన్యూ కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో కేజ్రీవాల్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నట్టు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను సవాల్ చేయడం కానీ, వ్యక్తిగత హాజరు నుంచి కోర్టును మినహాయింపు కోరడం కానీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.