70 శాతం ఓట్లు తెచ్చిన బూత్ నాయకులను సన్మానిస్తా

ప్రతి పోలింగ్ బూత్ లో 51 శాతం ఓట్లు బిజెపికి రావాలని స్పష్టం చేస్తూ  70 శాతం ఓట్లు తెచ్చిన బూత్ నాయకులను సన్మానిస్తానని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రకటించారు.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో `బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన్’ కార్యక్రమం నిర్వహిస్తూ  ముస్లిం మహిళల ఓట్లను కూడగట్టుకొని మెజార్టీ తెచ్చుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలను వంట ఇంటి కుందెల్లుగా, పిల్లలను కనే యంత్రాలుగా తయారు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బూత్ క‌మిటీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 24గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని తెలిపారు.

 రైతులు, మహిళలు, రైతు కూలీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం అవుతున్నామని చెబుతూ గ్రామంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పల్లెకు పోదాం.. అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 

పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. జాతీయ రహదారులతో దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం అనుసంధానం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ పేరు తొలగించిన రోజే కేసీఆర్ పార్టీ ఖతమైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

బిజెపికి  కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదని చెబుతూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలను వంట ఇంటి కుందెల్లుగా, పిల్లలను కనే యంత్రాలుగా తయారు చేస్తుందని హెచ్చరించారు.  కాగా, తెలంగాణాలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలతో గారడీ చేసిందని  కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకుంటుందో స్పష్టత లేదని ధ్వజమెత్తారు.

అప్పులు తీసుకునే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉందని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.  ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు.