భార‌త దౌత్య కార్యాలయంలో పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్

భార‌త దౌత్య కార్యాలయంలో పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్
భారత్ -రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాక్‌ నిఘా పెట్టింది. ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతడిని  యూపీ ఉగ్ర‌వాద వ్య‌తిరేక బృందం (ఏటీఎస్‌) మీర‌ట్ లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్‌ సివాల్‌గా గుర్తించింది.  స‌త్యేంద్ర సివ‌ల్ 2021 నుంచి మాస్కోలోని భార‌త రాయ‌బార కార్యాల‌యంలో ప‌నిచేస్తున్నాడు.
యూపీలోని హ‌పూర్‌కు చెందిన స‌త్యేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ‌లో ఎంటీఎస్ (మ‌ల్టీ టాస్కింగ్‌, స్టాఫ్‌)గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. కాగా, భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్‌ఐ ఏజెంట్‌ చొరబడ్డాడని రహస్య సమాచారం అందడంతో ఏటీఎస్‌ అప్రమత్తమైంది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని, ప్రతిగా డబ్బు తీసుకొంటున్నట్లు పసిగట్టింది. 

ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. సతేందర్‌ది హాపూర్‌ జిల్లా షమహిద్దుయూన్‌పుర్‌గా గుర్తించారు. అతడు మాస్కోలోని కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్డ్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా (ఐబీఎస్‌ఏ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌లో అతడు కీలక వ్యక్తని అధికారులు చెబుతున్నారు.

తన హోదాను అడ్డం పెట్టుకుని అతడు ముఖ్య పత్రాలను సంపాదించాడు. వీటిల్లో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి. భార‌త ప్ర‌భుత్వ అధికారుల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేసి వారి నుంచి భార‌త సైన్యం, దైనందిన కార్య‌కలాపాల గురించి స‌మాచారం రాబ‌ట్టిన‌ట్టు ద‌ర్యాప్తులో స‌త్యేంద్ర సివ‌ల్ అంగీక‌రించాడు.  ఈ సమాచారాన్ని పాక్‌లోని ఐఎస్‌ఐ ప్రతినిధులకు చేర్చాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాతే ఏటీఎస్‌ అధికారులు మీర‌ట్ కు విచారణకు పిలిపించారు. 

అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి తాను పాక్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించాడు. భార‌త రాయ‌బార కార్యాల‌యం, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌, విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌కు సంబంధించిన కీల‌క‌, ర‌హ‌స్య స‌మాచారాన్ని ఐఎస్ఐకి చేర‌వేసినట్టు ద‌ర్యాప్తులో గుర్తించారు. దీంతో అత‌డిని అరెస్ట్ చేశారు.