తెలంగాణలో జనసేనతో పొత్తుకు బీజేపీ స్వస్తి

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని  బీజేపీ ఎంపీ , పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.  లక్ష్మణ్‌ ప్రకటించారు. ఒంటరిగానే పోటీ చేసి పది సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేశాయి. 
జనసేన అభ్యర్థులు ఎక్కడా ప్రభావం చూపించలేక పోయారు. జనసేన నుంచి ఓట్ల బదిలీ జరగలేదని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో డా. లక్ష్మణ్‌ ఈ ప్రకటన చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటే నంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లక్ష్మణ్ మండిపడ్డారు. ఓటమి కుంగుబాటులో కేటీఆర్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతి, అహంకారం కారణంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారని, అది కాంగ్రెస్‌ విజయం కాదని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఉచితాలు, గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రైతుబంధు ఇవ్వకుండా రైతులను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించి, అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్‌ నాయకుల గొంతులు ఇప్పుడు మూగ బోయాయని ఆయన విమర్శించారు. అవినీతి ఆరోపణలున్న అధికారులతోనే కాంగ్రెస్‌ మంత్రులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇప్పించడం సిగ్గుచేటని విమర్శించారు. 

అవినీతి సొమ్ము కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ పార్టీలు రెండూ తోడుదొంగల వంటివని మండిపడ్డారు.  ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఇండియా కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

ఇండియా కూటమికి ఎజెండానే లేదని విమర్శించారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారనే అక్కసుతో కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ‘ఇండియా’ కూటమికి దేశ ప్రజల పట్ల పట్టింపు లేదని, అందుకే ఆ కూటమి చెల్లా చెదురు అవుతున్నదని చెప్పారు.