
ప్రాణ్‌ప్రతిష్ఠ’కు నేతృత్వం వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాముడు ఎట్టకేలకు అయోధ్యకు చేరుకున్నాడని, ఇది తనకు భావోద్వేగ క్షణమని తెలిపారు. మన రాముడు మళ్లీ వచ్చాడని, గుడారంలో ఉన్న రాముడు దివ్వమైన మందిరంలోకి వచ్చాడని తెలిపారు.
“రామ్ లల్లా కోసం ఈ గొప్ప ఆలయాన్ని ప్రతిష్టించినందున ఇకపై గుడారంలో నివసించడు” అని చెప్పారు. “చెప్పడానికి చాలా ఉంది..కానీ నా గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతోంది…నా శరీరం ఇంకా పులకరిస్తూనే ఉంది. మనసు గతంలోనూ లీనమై ఉంది…కానీ మన రామ్ లల్లా ఇక గుడారంలో ఉండరు…మన రామ్ లల్లా ఇప్పుడు దివ్య రామ మందిరంలో నివసిస్తారు…’’ అని ప్రధాని పేర్కొన్నారు.
జనవరి 22, 2024, కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, ఇది పరివర్తన శకానికి నాంది పలుకుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్షణం ప్రాముఖ్యత వేల సంవత్సరాల పాటు కొనసాగుతుందని, రాబోయే తరాల సామూహిక జ్ఞాపకంలో పొందుపరచబడిందని ఆయన తెలిపారు. తమ ప్రయత్నంలో జరిగిన లోపాలు, తమ త్యాగంలో జరిగిన లోపాలు ఉంటే తమను క్షమించాలని శ్రీరాముడిని కోరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. ఇన్ని శతాబ్ధాల నుంచి ఈ పని జరగనందుకు క్షమాపణులు కోరుతున్నట్లు చెప్పారు.
శ్రీరామజన్మభూమిలో రామాలయ నిర్మాణం పూర్తి అయ్యిందని, అందుచేత శ్రీరాముడు కచ్చితంగా క్షమిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. రాముడు వివాదం కాదు అని, ఆయన సమాధానం అన్నారు. రాముడు వర్తమానం కాదు అని.. ఆయన అనంతకాలం అని పేర్కొన్నారు. భారత్ దృష్టి, దర్శనం ఇప్పుడు మారిందని స్పష్టం చేశారు. వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీ, ఈ క్షణం గురించి మాట్లాడతారని స్పష్టం చేశారు.
రాముడి రూపంలో దేశం చైతన్య మందిరంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగిందని పేర్కొంటూ న్యాయమైన తీర్పును ఇచ్చిన న్యాయవ్యవస్థకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్ల వనవాసంతో దూరం అయ్యాడని, కానీ ఈ యుగంలో దేశ ప్రజల నుంచి అయోధ్య కొన్ని వందల ఏళ్ల పాటు దూరమైందని పేర్కొన్నారు.
ఈ ఎడబాటును దేశ ప్రజల్ని ఎంతో వేదనకు గురి చేసిందని చెబుతూ భవ్య భారత్, వికసిత భారత్‌కు ఈ అయోధ్యా మందిరం ఆధారంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేయసారు.భారత్ ఇప్పుడు ముందుకు వెళ్తుందని, అభివృద్ధిలో అగ్రపథానికి చేరుకుంటామని భరోసా వ్యక్తం చేశారు. ఈ స్మారక సందర్భాన్ని చూసినందుకు ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనవరి 22 నాటి ఆధ్యాత్మిక, చారిత్రక పరిమాణాన్ని ప్రస్తావిస్తూ భగవాన్ శ్రీరాముని అత్యున్నత ఆశీర్వాదాల కారణంగానే ఇది సాధ్యమయిందని స్పష్టం చేశారు.
“శతాబ్దాల నిరీక్షణ తర్వాత రాముడు ఎట్టకేలకు తన నివాసానికి వచ్చాడు. శతాబ్దాల పాటు మనం చూపిన సహనం, మనం చేసిన త్యాగాల తరువాత, మన రాముడు ఎట్టకేలకు వచ్చాడు” అని ప్రధాని చెప్పారు.
500 ఏండ్ల తర్వాత రామ్‌లల్లా తిరిగి వచ్చారు
500 ఏండ్ల తర్వాత మళ్లీ రామ్ లల్లా అయోధ్యకు తిరిగి వచ్చినట్లు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ తెలిపారు. రామ్ ఈ యుగానికి చెందిన చరిత్రకు చాలా శక్తి ఉందని, రామ్ లల్లా కథలు విన్నవారు తమ బాధలు, సమస్యలు నుంచి విముక్తి పొందుతున్నారని ఆయన చెప్పారు. రామ్‌లల్లాతో పాటు భారత స్వరం కూడా తిరిగివచ్చినట్లు భాగవత్ తెలిపారు. కొత్త భారత్ ఉద్భవించిందని చెబుతూ ఇవాళ జరిగిన కార్యక్రమమే దీనికి ప్రతీక అని వెల్లడించారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు