
500 ఏండ్ల కల నెరవేరింది. యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనం నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరాడు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ముందుగా నిర్ణయించిన దివ్యమైన ముహూర్తం ప్రకారం గర్భగుడిలో రాముడు కొలువుదీరాడు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చూసిన భక్త జనం రామ నామ స్మరణతో పరవశించిపోయింది. కొత్తగా నిర్మించిన రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.
సుమారు 84 సెకన్ల పాటు అసలు క్రతువును నిర్వహించారు. కీలకమైన ఈ 84 సెకన్ల సమయంలోనే రాముడి మూర్తికి ప్రాణ ప్రతిష్ట చేశారు. రాముడి విగ్రహం కండ్లకు ఉన్న వస్త్రాన్ని ప్రధాని తొలగించారు. ఆ తర్వాత పుష్పాలతో రామున్ని పూజించారు. ప్రాణ ప్రతిష్ట సమయంలో 50 శంఖాలు ఊదారు. గర్భిగుడి పూజలు ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
శ్రీ రామ జన్మభూమి రామమందిరంలో ఇవాళ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం రామ్ లల్లాను మంత్రోచ్ఛరణతో నిద్ర లేపారు. వైదిక మంత్రాలు మంగళా సాసనం పాడారు. ఉదయం 10 గంటల నుంచి ప్రాణప్రతిష్టకు చెందిన పూజలు ప్రారంభం అయ్యాయి. ఒకవైపు గర్భగుడిలో బాలరాముడి మూర్తికి పూజలు.. మరో వైపు యజ్ఞశాలలో హవనం సాగింది. బాల రాముడికి ప్రధాని నరేంద్ర మోదీ పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. అనంతరం రామ్ లల్లా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడికి తొలి హారతి ఇచ్చారు. ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తైన తర్వాత వేడుకలకు హాజరైన సాధువుల వద్దకు వెళ్లిన మోదీ.. వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సాధువులు సైతం మోదీని హత్తుకుని అభినందనలు తెలిపారు. అనంతరం వారి నుంచి ప్రధాని కానుకలు కూడా స్వీకరించారు.
అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య నగరం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు అయోధ్యకు వచ్చి చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ మహత్తర ఘట్టాన్ని స్వయంగా వీక్షించేందుకు దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది అయోధ్యకు వచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఓ సాధువు మోదీకి తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన ఆశీర్వాదాన్ని మోదీ తీసుకున్నారు.
More Stories
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!
విద్యార్థి వీసాపై పాక్ కు వెళ్లి శిక్షణ తీసుకున్న ఆదిల్ థోకర్!