32 ఏళ్ల నాటి కల.. నెరవేరింది ఈ వేళ

సరిగ్గా 32 ఏళ్ల కిందట.. నేటి ప్రధాని మోడీ అయోధ్యను సందర్శించారు. అప్పుడు ఓ టెంట్ లో ఉన్న రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆ విగ్రహాన్ని తదేకంగా చాలా సమయం పాటు చూశారు. ఆ సమయంలో ఆయన మనస్సులో అనుకున్నది ఒక్కటే. “నీకు ఆలయం కట్టిన తర్వాతే ఈ నేలపై అడుగు పెడతా” అని. ఆనాటి మోడీ ప్రతిజ్ఞ నేడు నెరవేరబోతోంది. ఈ మధ్యలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఓటములు చూశారు. అయినా తాను అనుకున్నది నెరవేర్చుకునేందుకు అన్నింటినీ భరించారు. ప్రధాని హోదాలో చేయాల్సిందంతా చేశారు. ఆనాడు ఆయన చేసిన ప్రతిజ్ఞ.. నేడు నెరవేరబోతోంది.
ఒకప్పుడు అయోధ్య భావోద్వేగ సమస్య. కానీ నేడు అది వివాద రహిత అంశం. వందల ఏళ్లుగా దేశప్రజల్లో నాటుకుపోయిన ఈ అంశానికి న్యాయపరంగా పరిష్కారం చూపించారు. చారిత్రక ఆధారాలతో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అందరూ శిరసావహించేలా చేశారు. ప్రత్యర్థి వర్గానికి కూడా స్థలం కేటాయించి.. వారిలో ఉన్న అసంతృప్తిని కూడా తొలగేలా చేశారు.
మూడున్నరేళ్ల క్రితం పునాది రాయి వేశారు. నేడు ఆలయాన్ని రామభక్తులకు అంకితం ఇవ్వబోతున్నారు. కేవలం ఈ మహత్తర ఘట్టంలో పాలు పంచుకునేందుకే.. దేవుడు తనకీ జన్మనిచ్చాడేమో అంటూ.. ఈ అద్భుత క్షణాలను ఆస్వాదిస్తున్న వేళ.. మోడీ భావోద్వేగానికి గురవుతున్నారు.
అందుకే రామమందిరం ప్రాణప్రతిష్ట క్రతువును నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. కఠినమైన నియమాలతో దీక్ష చేపట్టడమే కాకుండా.. రాముడి చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలు, ఆలయాలను సందర్శిస్తున్నారు. రామాయణంలోని చారిత్రక ఘట్టాలను స్మరించుకుంటూ దేశయాత్ర చేపట్టారు. అందులో భాగంగానే లంకా విజయం తర్వాత తమిళనాడులోని రామేశ్వరంలో స్వయంగా రాముడి చేత ప్రతిష్టించిన శివలింగ దర్శనం, ధనుష్కోడి లో రామసేతు దగ్గర పూజలు చేశారు.