రమ్మంటోంది.. రామజన్మభూమి 

రమ్మంటోంది.. రామజన్మభూమి 
ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్య ఆలయాన్ని రకరకాల పూలతో, దీపాలతో.. కాంతులు విరాజిల్లేలా సరికొత్త హంగులు కల్పించారు. పూల సుగంధాలతో ఆలయ ప్రాకారమంతా ఆధ్యాత్మిక కళ సంతరించుకుంది. సంప్రదాయ కోణం ఉట్టిపడేలా ప్రమిదల ఆకారంలో చేసిన దీపాలంకరణ ప్రతేక శోభనిస్తోంది. 161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా నిర్మించిన ఆలయానికి తూర్పు వైపున ప్రవేశద్వారం ఉండగా, 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి రావాల్సి ఉంటుంది. దర్శనం తర్వాత దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వచ్చేలా నిర్మించారు.
ఆలయ నిర్మాణంలో ఎవరూ ఊహించని విధంగా భారతీయులకు మాత్రమే సొంతమైన ప్రత్యేక కళను అద్దారు. ఏటా శ్రీరామనవమి పర్వదినాన అయోధ్య ఆలయం గర్భగుడిలో కొలువైన రాముడి తిలకంపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీన్ని రాముడికి “సూర్యతిలకం” గా అభివర్ణిస్తున్నారు. సాంకేతికతతో పాటు.. సంప్రదాయాల సమాహారమైన ఈ ప్రత్యేక ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చాంద్రమాన క్యాలండర్ ప్రకారం ఏటా శ్రీరామనవమిని నిర్ణయిస్తారు. కానీ, సూర్యుడి సంచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అంటే ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవు. ఇందుకోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. సూర్య, చంద్రరాశుల తిథులు 19 ఏళ్లకు ఒకసారి కలుస్తాయి. దీన్ని ఆధారం చేసుకొని రామనవమి రోజు సూర్యుడి గమనంలో వచ్చే మార్పుకు అనుగుణంగా కటకాలు, అద్దాలను గేర్‌బాక్స్‌ల సాయంతో అమరుస్తారు. అందుకోసం 19 గేర్‌బాక్స్‌లను రూపొందించారు.
తద్వారా చాంద్రమాన తిథికి అనుగుణంగా సూర్య కిరణాలు ఏటా రామనవమి నాడు సరిగ్గా రాముడి నుదుటిపై ఒకే స్థానంలో ప్రసరించేలా చేస్తారు. ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూల్ తెలిపింది. సూర్యకిరణాలు మూడో అంతస్తుపై ఉండే శిఖరం నుంచి రావాల్సి ఉన్నందున ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాతే దీన్ని ఆవిష్కరించనున్నారు.
ఇక ప్రాణప్రతిష్ట కోసం తరలివచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిహాంగ్‌ సింగ్స్‌, ఇస్కాన్‌ వంటి సంస్థలు వంటశాలలను ఏర్పాటు చేశాయి. రాం కీ రసోయ్‌ నుంచి లంగర్‌ వరకూ వంటశాలలను ఏర్పాటు చేశాయి. అయోధ్యలోని ప్రతి వీధిలో ఇవి ఏర్పాటయ్యాయి. కిచిడీ, ఆలూ పూరీ, కధీ చావల్‌, ఆచార్‌, పాపడ్‌లను భక్తులను అందించనున్నారు. ఛార్‌ధామ్‌ మఠ్‌లో వారు 2 నెలలపాటు లంగర్‌ను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందజేస్తారు. అయితే ఉత్తరాన చలిగాలుల ప్రభావంతో అయోధ్యలో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో భక్తులకు వేడి వేడి చాయ్ ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్నాకు చెందిన మహావీర్‌ ఆలయ ట్రస్టు రోజుకు 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రాం కీ రసోయ్‌ వంట గదిని సిద్ధం చేసింది. ఇస్కాన్‌ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించనుంది.