వ్యూహాత్మక భాగస్వామ్యంపై పుతిన్ తో మోదీ చర్చ

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో సోమవారం మాట్లాడారు. భారత్-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ది చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. అత్యున్నత స్థాయిలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాధినేతలు సమీక్షించారు.
 
‘అధ్యక్షుడు పుతిన్‌తో మంచి సంభాషణ జరిగింది. మేము మా ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలో వివిధ సానుకూల పరిణామాలను చర్చించాము, భవిష్యత్ కార్యక్రమాల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి అంగీకరించాము. రష్యా ప్రెసిడెన్సీ ఆఫ్ ది బ్రిక్స్‌తో సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా మేము ఉపయోగకరమైన అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాము’ అని ప్రధాన మంత్రి సోషల్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు.
 
‘ఇద్దరు నేతలు ఫాలో-అప్‌లో ద్వైపాక్షిక సహకారం అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. రెండు దేశాల మధ్య ఇటీవలి ఉన్నత స్థాయి మార్పిడికి, ద్వైపాక్షిక సంబంధాలలో పరిణామాలను సానుకూలంగా అంచనా వేశారు. భారతదేశం-రష్యా ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాల కోసం రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడానికి అంగీకరించారు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
 
‘పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. 2024లో రష్యా బ్రిక్స్ అధ్యక్ష పదవికి తన శుభాకాంక్షలను తెలియజేశారు. భారతదేశం పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇరువురు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారు’ అని పీఎంవో ఆ ప్రకటనలో పేర్కొంది.
 
మరోవైపు, ‘ఇద్దరు నాయకులు “పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత తీవ్రతరం చేయడంలో ఆసక్తిని వ్యక్తం చేశారు, ఉక్రెయిన్‌‌లో పరిస్థితిని స్పృశించారు అని క్రెమిన్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగ, యుఎస్, ఇతర పాశ్చాత్య దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూ ఉక్రెయిన్ యుద్ధం మధ్య భారతదేశం తన పాత మిత్రదేశమైన రష్యాతో మంచి సంబంధాలను కొనసాగించింది.