ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు

 
* సుప్రీంకోర్టు తేల్చేవరకు హాజరుకానని స్పష్టం
ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈడీ ముందు హాజరుకావాలని సోమవారం పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు అందుకున్న కవిత విచారణను కూడా ఎదుర్కొన్నారు.  అయితే, తాను హాజరుకాలేనని పేర్కొంటూ కవిత ఈడీకి లేఖ రాశారు.
పెండింగ్ లో ఉన్న పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చేవరకు విచారణకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో ఆమె స్పష్టం చేశారు.  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గతేడాదే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.
మహిళనైన తనను విచారణ కోసం.. ఈడీ ఆఫీసుకు పిలిచి రాత్రి వరకు విచారణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.
మహిళల విచారణకు సంబంధించిన మార్గదర‌్శకాలపై కూడా కవిత స్పష్టత చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈడీ విచారణను సవాలు చేస్తూ గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడంపై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.

పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు. తదుపరి విచారణను నవంబర్‌ 20కు వాయిదా వేసింది. అక్టోబర్‌ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తెలిపారు. ఈ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై విచారణ చేపడతామని చెప్పారు. అయితే అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.