హిమాలయ సంజీవని ఔషధ మొక్కపై పరిశోధనలు

రామాయణంలోని సంజీవని ఔషధ మొక్క గురించి తెలియనివారు ఉండరు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న లక్ష్మణుడిని పూర్వ స్థితిలోకి తీసుకు రావడానికి హిమాలయాల నుంచి హనుమంతుడు ఈ మొక్కను తీసుకొచ్చినట్టు పురాణాల సారాంశం. ఈ మొక్క గురించి పలు భారతీయ ప్రాచీన గ్రంథాలలో ప్రస్తావన ఉంది. ఇప్పటికీ హిమాలయాల్లోని ద్రోణగిరి ప్రాంతంలో ఈ మొక్క ఉన్నట్టు పలువురి నమ్మకం.
 
ప్రస్తుతం ఈ మొక్క ఉనికిని, మన ప్రాచీన గ్రంధాలలో ప్రస్తావనలు ప్రశ్నించకుండా ఈ మొక్క గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, సంజీవని అంటే కేవలం ఒక మొక్క కాదని, పరమేశ్వరుడికి మాత్రమే తెలిసిన పలు మొక్కలతో చేపట్టే వైద్య పక్రియ అని ప్రాచీన మహర్షులు భావించేవారు.
 
ప్రఖ్యాతి చెందిన భృగు మహర్షి కుమారుడైన శుక్రాచార్యకు ఈ వైద్య చికిత్స గురించి స్వయంగా పరమేశ్వరుడు వివరించారని చెబుతుంటారు. పరశురాముడు, భార్గవలు మృతి చెందిన తర్వాత ఈ మొక్కను ఉపయోగించే పరమేశ్వరుడు తిరిగి బ్రతికించారని కూడా చెబుతుంటారు. బృహస్పతి మహర్షికి కూడా సంజీవని చికిత్స తెలుసని గ్రంధాలలో ఉంది.
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో ఈ మొక్క ఉందని భావిస్తున్నారు. 2009లో డా. గణేశన్ అనే శాస్త్రవేత్త `కరెంటు సైన్స్’లో సంజీవని గురించి ఓ పరిశోధన వ్యాసాన్ని పరిశీలించారు. ఈ మొక్కకు  `సెలగినెల్ల బ్రయోప్టెరిస్’ అనే శాస్త్రీయ నామం ఇచ్చారు. `టెలిగ్రాఫ్’ పత్రికలో సెప్టెంబర్, 2005లో ప్రచురించిన మరో పరిశోధన వ్యాసంలో ఈ మొక్కకు కణాలను పెంపొందింపచేసే లక్షణం ఉందని తెలిపారు.
 
ఇలా ఉండగా, 2016లో ఈ ఔషధ మొక్కను వెదకడానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రూ.25 కోట్లతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.  తీవ్రంగా శ్రమించిన ఆ బృందం 2020లో ఓ మొక్కను గుర్తించి ల్యాబ్‌లో పరీక్షలకు పంపించింది. ఇంతలో ‘అదే సంజీవని మొక్క’ అంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. 
 
అయితే, రామాయణంలోని సంజీవని మొక్క అదేనా? అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కారణం ఆ మొక్క గురించి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతుండటమే. ఈ అంశంపై బృందంలో సభ్యుడైన మయారం ఉన్నియాల్‌ మాట్లాడుతూ తాము గుర్తించిన ఔషధ మొక్కకు కొన్ని రోగాలను మాత్రమే నయం చేసే గుణాలు ఉన్నాయని తెలిపారు. 
 
అయితే, ఇదే సంజీవని అని చెప్పడానికి మరికొన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. కాగా, రామాయణ కాలం నుంచి ఇప్పటి వరకు వాతావరణంలో ఎన్నో మార్పులు జరిగాయని, అందుకనే సంజీవని మొక్క ఇలా రూపాంతరం చెంది కొన్ని గుణాలు కోల్పోయిందని మరికొందరు వాదిస్తున్నారు.