`హనుమాన్’ వసూళ్ల నుంచి అయోధ్యకు రూ 14.86 లక్షలు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హను-మాన్ చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.  సంక్రాంతి సందర్భంగా పాన్ వరల్డ్ రేంజ్‍లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ చోట పాజిటివ్ రెస్పాన్స్‌తో హను-మాన్ దూసుకెళుతోంది. గురువారం పెయిడ్ ప్రీమియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ వచ్చింది. ప్రీమియర్లతోనే మంచి కలెక్షన్లు వచ్చాయి. 
 
కాగా, హనుమాన్ చిత్రానికి అమ్ముడయ్యే ప్రతీ టికెట్ నుంచి రూ.5ను అయోధ్య రామమందిరానికి విరాళం ఇస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడత సమర్పించింది.  హనుమాన్ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్ల నుంచి అయోధ్య రామమందిరానికి తొలి విడత విరాళం ఇచ్చింది మూవీ టీమ్. 
 
ఇప్పటి వరకు అమ్ముడైన ప్రతీ టికెట్‍పై 5 రూపాయాల చొప్పున అందించింది. ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్లలో రూ.14,85,810 లక్షల చెక్‍ను అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్రానికి మూవీ టీమ్ పంపింది.  హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, అమృత అయ్యర్ ఈ చెక్‍ నమూనాతో ఉన్న ఫొటోన మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. పెయిడ్ ప్రీమియర్లలో 2,97,162 టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
హనుమాన్ సినిమా థియేటర్లలో ఆడినన్నీ రోజులు ప్రతీ టికెట్‍పై రూ.5 చొప్పున అయోధ్య రామమందిరానికి ఇవ్వనుంది మూవీ టీమ్. అయితే, ప్రతీ రోజు ఎంత మొత్తం విరాళం ఇస్తున్నది అందరికీ తెలిపేందుకు ఓ వెబ్‍సైట్‍ను కూడా లాంచ్ చేయనున్నట్టు సినిమా యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తొలి చెక్ అందించిన ఫొటోలను పోస్ట్ చేసింది.

అగ్రనటుల చిత్రాల మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా సాధారణ నటులతో విడుదలైన `హనుమాన్’ చిత్రం బ్లాక్‍బాస్టర్ టాక్ దక్కించుకోవడంతో మూవీ టీమ్ చాలా సంతోషంలో ఉంది. ఈ తరుణంలో హైదరాబాద్‍లోని ఫిల్మ్ నగర్ హనుమాన్ ఆలయంలో పూజలో పాల్గొన్నారు తేజ సజ్జా, అమృత అయ్యర్, ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి. ఆలయంలోనే బ్లాక్‍బాస్టర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

హనుమంతుడి మణి వల్ల అతీత శక్తులు పొందే యువకుడు హనుమంతుగా ఈ చిత్రంలో నటించారు తేజ సజ్జా. ఆ మణి విలన్‍కు దక్కకుండా హనుమంతు ఎలా అడ్డుకున్నాడు.. తన ప్రాంతాన్ని ఎలా కాపాడుకున్నాడన్న అంశాలతో హనుమాన్ మూవీ తెరకెక్కింది.  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, హనుమంతుడిని అద్భుతంగా చూపించిన విధానం, సూపర్ హీరో సీన్లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

గౌర హరి అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా హనుమాన్‍కు మరో హైలైట్‍గా ఉంది. హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా చేయగా, వరలక్ష్మి శరత్‍కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, రాజ్‍దీపక్ శెట్టి, సత్య కీరోల్స్ చేశారు. ప్రైమ్ షో ఎఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.