1,000 దాటిన జేఎన్‌.1 కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. నెలన్నరలోపే ఈ వైరస్‌ ఏకంగా 50 దేశాలకు పాకింది. ఇక భారత్‌లోనూ కొత్త వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో జేఎన్‌.1 కేసులు వెయ్యి దాటాయి. ఈ వైరస్‌ తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా పాకింది. దీంతో మొత్తం 16 రాష్ట్రాలకు ఈ వైరస్‌ వ్యాపించినట్లు ఇన్సాకాగ్‌ వెల్లడించింది.
 
ఇండియన్ సార్స్‌ కోవ్‌ 2 జెనోమిక్స్ కన్సార్టియం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 11వ తేదీ వరకూ దేశంలో 1,013 జేఎన్‌.1 కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా కర్ణాటకలో 214 కేసులు వెలుగు చూశాయి.  ఆ తర్వాత మహారాష్ట్రలో 170, కేరళలో 154, ఆంధ్రప్రదేశ్‌లో 189, గుజరాత్‌లో 76, గోవాలో 66, తెలంగాణలో 32, రాజస్థాన్‌లో 32, ఛత్తీస్‌గఢ్‌లో 25, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, ఉత్తరప్రదేశ్‌లో 6, హర్యానాలో ఐదు, ఒడిశాలో మూడు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసులు నమోదైంది.

మరోవైపు బిఎ 2.86 రకానికి చెందిన ఈ జేఎన్‌.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది.  ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,368 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి.  కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,412కి చేరింది. ఇక కరోనా వైరస్‌ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,44,84,162 మంది కోలుకున్నారు.