ఏపీలో 5.64 లక్షల ఓట్లు తొలగింపు

ఏపీలో 5.64 లక్షల ఓట్లు తొలగింపు

* 50 మంది బీఎల్వోలపై చర్యలు

వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదులతో 14.48 లక్షల ఓట్లను పరిశీలించి 5,64,819 ఓట్లను అనర్హమైనవిగా గుర్తించి ఓటర్ల జాబితా నుంచి అనర్హులను కలెక్టర్లు తొలగించారని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించామని తెలిపారు.
 
గందరగోళం లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని, డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామని మీనా వివరించారు.

కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయన్న విషయంపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. కాకినాడ, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఫామ్-7 ద్వారా భారీగా ఓటర్లను చేరుస్తున్న 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. 

చంద్రగిరి నియోజకవర్గంలో పలువురిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్‌వోలపై కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశామని, పర్చూరు సీఐ, ఎస్ఐ, ఈఆర్వో సస్పెండ్ అయ్యారని వెల్లడించారు. ఉరవకొండ, ప్రొద్దుటూరు ఈఆర్వోలను కూడా సస్పెండ్ చేశామని వివరించారు.

జీరో డోర్ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న కేసుల్లో తనిఖీలు పూర్తి చేసి, ఓటర్ల జాబితాను సవరించామని మీనా తెలిపారు. ఒకే కుటుంబంలోని ఓటర్లకు వేరు వేరు పోలింగ్ కేంద్రాలకు మారిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. 

ఎన్నికల సంఘం చర్యలకు గురైన వారు ఎన్నికల్లో విధుల్లో ఉండరని చెబుతూ ఇప్పటివరకు 50 మంది బీఎల్వోలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించామని వెల్లడించారు.