రామ మందిరంపై విషం కక్కిన ఖలిస్తానీ ఉగ్రవాది

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఎప్పుడైతే కెనడా ఆరోపణలు చేసిందో అప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చిపోతున్నాడు. నిషేధించబడిన ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థకు అధ్యక్షుడైన అతగాడు భారత్‌కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. 
 
ఇప్పుడు ఈ ఉగ్రవాది అయోధ్యలోని రామ మందిరంపై విషం కక్కాడు. భారతీయ ముస్లింలను రెచ్చగొట్టేలా జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పేర్కొన్నాడు. అమృత్‌సర్ నుండి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులను మూసివేయాలని కూడా పిలుపునిచ్చాడు. ఈ మేరకు అతడు కొత్త వీడియో విడుదల చేశాడు.
‘‘అమృత్‌సర్ నుండి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులను మూసివేయండి. ముస్లింలారా.. భారత్ నుండి మీకంటూ సొంతంగా ఒక ఉర్దూస్తాన్‌ని ఏర్పాటు చేసుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది’’ అంటూ ఆ వీడియోలో గురుపత్వంత్ సింగ్ పేర్కొన్నట్టు రిపబ్లిక్ టివి నివేదించింది. 

రామ్‌లల్లా ప్రతిష్టాతప వేడుకల్ని యావత్ ప్రపంచం చూడనుందని, కాబట్టి దీనికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన తెలపాలని అతడు చెప్పుకొచ్చాడు. బాబ్రీ మసీదుపై ఈ ఆలయాన్ని నిర్మించారని, కాబట్టి ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసనలు తెలియజేయాల్సిందేనని అతడు పిలుపిచ్చాడు.

ఇదే సమయంలో  ప్రధాని నరేంద్ర మోదీపై కూడా అతడు సంచలన ఆరోపణలు చేశాడు. జనవరి 22వ తేదీన ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ చేపట్టనున్నారని., ప్రధానిని వ్యతిరేకించాలని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఇదిలావుండగా, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ఖాళీ చేయించేందుకు 1984లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌‌ని చేపట్టారు. ఇది ఆ సంవత్సరంలో జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగింది. 

ఈ ఆపరేషన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది జనరల్ సింగ్ బిందార్వాలా భారత సైన్యం చేతిలో హతమయ్యాడు. ఈ బిందర్వాలాని తన ఆదర్శంగా చెప్పుకునే పన్నూ ప్రత్యేక ఖలిస్తాన్‌ను డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు ఎన్నో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దీంతో 2020లో భారత్ అతడ్ని ఉగ్రవాదిగా ప్రకటించింది.