ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా.. ఆయోధ్య

మరికొన్ని రోజుల్లోనే నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ఇటు రాష్ట్రప్రభుత్వానికి, అటు కేంద్రానికి కనకవర్షం కురిపించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారబోతోంది. అయోధ్య నేడు చారిత్రక నగరం మాత్రమే కాదు. వేల కోట్లతో ఎన్నో ప్రతిష్టాత్మక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేసుకోబోతున్న అత్యాధునిక నగరం.

రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్ తో పాటు.. సుందరమైన విశాల రహదారులు, పర్యాటక ప్రదేశాలతో.. టెంపుల్ టూరిజానికి సంబంధించి వారణాసి తర్వాత అయోధ్య వెలుగొందనుంది. ఇటీవలే ప్రధాని మోడీ దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. రామాలయ సముదాయంతో పాటు, అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇక్కడికి తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ మార్పులు సహజంగానే నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచడమే కాకుండా, నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మారుస్తుందన్న అంచనాలున్నాయి. ఈ అభివృద్ధి పనులు అయోధ్యకు పొరుగున ఉన్న 12 జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం.. తాజాగా జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం చూస్తుంటే  వచ్చే పదేళ్లలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

ప్రస్తుతం 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో.. మాస్టర్ ప్లాన్డ్ సిటీ ప్రాంతం 133 చదరపు కిలోమీటర్లు, కోర్ సిటీ 31.5 చదరపు కిలోమీటర్లతో సహా అభివృద్ధి పుంజుకోనుంది. ఈ విజన్‌లో 21వ శతాబ్దంలో ప్రపంచస్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలు అయోధ్యకు ఉన్నాయని, అదే సమయంలో చరిత్ర, సంస్కృతికి కేంద్ర బిందువుగా కూడా ఉండబోతోందని చెబుతున్నారు.

అయోధ్య ప్రాణప్రతిష్ట తర్వాత రాముడి దర్శనం కోసం నిత్యం సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.  దీంతో ముందు ముందు అయోధ్యలో నివాసితులు, పర్యాటకుల నిష్పత్తి 1:10 గా ఉండబోతోందని చెబుతున్నారు. ఇందుకోసం గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో స్టేట్ గెస్ట్ హౌస్‌లు, అన్ని రకాల సందర్శకులకు సౌకర్యాలు కల్పించేందుకు హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు.

రూ.31,662 కోట్ల బడ్జెట్‌తో నగరానికి సరికొత్త రూపాన్ని, అనుభూతిని అందించడానికి మొత్తం 37 రాష్ట్ర, జాతీయ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తుండగా, యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం రూ.7,500 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులను చేపట్టింది. అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ స్పష్టం చేస్తోంది.

జనవరి 22న జరిగే రామమందిర ప్రతిష్ఠాపనకు ముందు ఎఫ్‌ఎంసిజి కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్‌లు అయోధ్యలో కొలువుదీరుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, సందర్శకుల జనాభాలో 8-10 రెట్లు పెరుగుదల నమోదు చేయబోతోందని అంచనా. తాజ్, రాడిసన్, ఐటీసీ హోటల్స్ వంటి ప్రముఖ 5-స్టార్ బ్రాండ్‌ల నుండి ఓయో వంటి బడ్జెట్ ప్లేయర్‌ల వరకు, కంపెనీలు కొత్త హోటల్‌లను తెరవడానికి ఇప్పటికే క్యూలో ఉన్నాయి.