నేటి నుండి ఏపీలో ఈసీ బృందం పర్యటన

అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు రేపు విజయవాడ చేరుకోనున్నారు. ఈసీ బృందం ఈ నెల 9న రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.

ఓటర్ల జాబితాలో తప్పులు, రాజకీయ పార్టీల ఫిర్యాదులపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించనుంది. దీంతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది.  అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 10న సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈసీ బృందం భద్రత బలగాలు, ఏపీ సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో భేటీ కానుంది.

ఈనెల 10వ తేదీ సాయత్రం గం.4.30 లకు సీఈసీ, ఎలక్షన్ కమిషనర్లు మీడియాతో మాట్లాడతారు. ఈ మీడియా సమావేశం ఈసీ బృందం దిల్లీ తిరిగి వెళ్లనున్నారు.  2024 ఓటర్ల తుది జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ అంశాలపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించనుంది. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్షించనుంది.

కేంద్ర ఎన్నికల సంఘం బృందంతో ఈ నెల 9న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. దీంతో ఈనెల 9న వెంకటగిరిలో నిర్వహించాల్సిన టీడీపీ ‘రా.. కదలిరా’ కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఓట్ల అవకతవకలపై ఈసీ బృందానికి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు చేయనున్నారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈసీ బృందం పర్యటన, సమీక్ష అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తొలి దశలోనే ముగిసేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. 

దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు, తమిళనాడు లోక్ సభ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తిచేసేలా ఈసీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  నేటి నుంచి లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ఈసీ కసరత్తులు మొదలుపెట్టింది. ఇవాళ తమిళనాడులో ఈసీ బృందం పర్యటించింది. తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లకు, ఏపీ అసెంబ్లీలోని 175 స్థానాలతో పాటు 25 లోక్‌సభ సీట్లకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది.